బంధువుల ఇంటికి వెళ్తూ.. 

4 Jul, 2022 22:57 IST|Sakshi

భార్య దుర్మరణం, భర్తకు గాయాలు  

మోపెడ్‌ను ఢీకొన్న ట్యాంకర్‌ 

పోరుమామిళ్ల: భార్యాభర్తలు బంధువుల ఇంటికి వెళ్తూ.. రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో భార్య దుర్మరణం చెందగా, భర్త గాయాల పాలయ్యాడు. ఈ సంఘటన పోరుమామిళ్ల మండలంలోని రామిరెడ్డికుంట వద్ద ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం రంగనాయుడిపల్లెకు చెందిన దంపతులు రాగి నారాయణ, పోలమ్మ.. పోరుమామిళ్ల మండలం రామేశ్వరం ఎస్టీ కాలనీలోని బంధువుల ఇంటికి టీవీఎస్‌ మోపెడ్‌పై వస్తున్నారు.

ఈ వాహనాన్ని కొమరోలు వైపు నుంచి పోరుమామిళ్ల వైపు వస్తున్న ట్యాంకర్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో మోపెడ్‌ పైనుంచి ఇద్దరూ కింద పడిపోయారు. పోలమ్మ తలపై ట్యాంకర్‌ చక్రం వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. నారాయణకు స్వల్ప గాయాలయ్యాయి. ఎస్‌ఐ హరిప్రసాద్‌ ఘటన స్థలానికి చేరకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోరుమామిళ్ల ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు