దివ్యాంగ బాలిక దారుణ హత్య.. కత్తితో దాడి చేసి పరారైన సైకో

14 Feb, 2023 07:47 IST|Sakshi

గుంటూరు జిల్లా తాడేపల్లిలో దారుణం  

నిందితుడికి టీడీపీ నేతలతో సంబంధాలు

గంట వ్యవధిలో నిందితుడు అరెస్టు 

బాధిత కుటుంబానికి రూ.10లక్షల సాయం ప్రకటించిన సీఎం జగన్‌ 

సాక్షి, తాడేపల్లి రూరల్‌: బాలిక తల్లి మీద కక్ష పెంచుకున్న యువకుడు చివరికి దివ్యాంగురాలైన ఆమె కుమార్తెను వేధింపులకు గురిచేసి చివరికి హత్యచేశాడు. ఆదివారం రాత్రి జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. తాడేపల్లి పట్టణం ఎన్టీఆర్‌ కరకట్టకు చెందిన వంగ మనోరమ కుమార్తె ఎస్తేరురాణి (17) పుట్టుకతోనే దివ్యాంగురాలు(అంధురాలు). తండ్రి యేబుతో తల్లి విడిపోవడంతో ఎస్తేరురాణి తల్లి వద్ద ఉంటోంది. మనోరమ ఇంటికి వచ్చి వెళ్లే దేవదాసు అనే యువకుడికి ఇదే ప్రాంతానికి చెందిన నాగపోగు ధనుంజయరాజు అలియాస్‌ కుక్కల రాజు పరిచయమయ్యాడు. మనోరమ, కుక్కల రాజుల ఇళ్లు ఎదురెదురు కావడంతో దేవదాసు రెండు ఇళ్లకూ వస్తూ పోతూ ఉంటాడు.

మూడు రోజుల కిందట దేవదాసు మద్యం తాగి మనోరమ ఇంట్లో వాంతి చేసుకోవడంతో ఆయన చేతే మనోరమ ఇల్లు కడిగించింది. దీనిని కుక్కల రాజు వీడియో తీసి అందరికీ చూపడంతో కక్ష పెంచుకున్న దేవదాసు.. కుక్కల రాజును చంపుతానని బెదిరించాడు. దీంతో మొదలైన వివాదం.. కుక్కల రాజు మనోరమ చేయి పట్టుకుని లాగి ఇష్టమొచ్చినట్లు మాట్లాడేంత వరకూ వెళ్లింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె రాజు బంధువులకు విషయం చెప్పడంతో వారు కుక్కల రాజును మందలించారు.

దీంతో కోపం పెంచుకున్న కుక్కల రాజు ఆదివారం రాత్రి ఎవరూ లేని సమయంలో మనోరమ ఇంటికి వెళ్లి అంధురాలైన ఎస్తేరురాణి చేయిపట్టుకుని లాగాడు. ఆమె ప్రతిఘటించడంతో  కత్తితో ఆమె మెడపై, తలపై విచక్షణ రహితంగా నరికాడు. ఎస్తేరురాణి పెద్దగా కేకలు వేయడంతో తల్లితో పాటు అక్కడే ఉన్న బంధువులు పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పటికే కుక్కల రాజు పరారయ్యాడు. గాయపడిన ఎస్తేరురాణిని బంధు­వులు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఈ ఘటన వెలుగులోకొచి్చంది. దీంతో పోలీసులు కుక్కల రాజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  

టీడీపీ నేతల సంరక్షణలో కుక్కల రాజు 
కుక్కల రాజు వివాహానంతరం విజయవాడ రాణిగారితోట నుంచి కరకట్టకు వచ్చి భార్య, తల్లితో కలసి నివాసముంటున్నాడు. 2019లో తల్లితో, భార్యతో వివాదం రావడంతో వారిని తీవ్రంగా కొట్టి గొడ్డలితో నరికేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో తల్లి, భార్య పారిపోయి తాడేపల్లి పోలీసులను ఆశ్రయించగా, కుక్కల రాజు గొడ్డలితో పోలీసులపై దాడికి పాల్పడ్డాడు. పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఈ నేపథ్యంలో తల్లీ, భార్య అతనికి దూరంగా ఉంటున్నారు. అప్పటి నుంచి కరకట్ట మీద పట్టాభిరామయ్య కాలనీకి చెందిన కొంతమంది టీడీపీ కార్యకర్తలు అతనికి ఆశ్రయం కల్పించారు. కుక్కల రాజు కుక్కలను పెంచుతూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలోనే టీడీపీ కార్యకర్తలకు, కుక్కల రాజుకు గొడవ జరగ్గా.. కుక్కల రాజును చేరదీసిన వారే చితకబాది, పెంపుడు కుక్కలతో కరిపించారు. ఈ ఘటనపై తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మొదటి నుంచి సైకోలా వ్యవహరిస్తున్న కుక్కల రాజును పోలీసుల నుంచి కాపాడింది టీడీపీ నేతలే. ఇదిలా ఉండగా, బాధితురాలి కుటుంబ సభ్యులను సోమవారం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుందని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తుందని చెప్పారు.   

పోలీసుల అదుపులో నిందితుడు.. 
ఎస్తేరు రాణిని హత్యచేసిన కుక్కలరాజును పోలీసులు గంట వ్యవధిలో అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందిన వెంటనే నార్త్‌జోన్‌ డీఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలో మంగళగిరి, తాడేపల్లి, దుగ్గి­రాల, పెదకాకాని పోలీసులను అప్రమత్తంచేసి క్రైం సిబ్బందితో జల్లెడ పట్టారు. సీతానగరం రైల్వేబ్రిడ్జి మీద నుంచి విజయవాడ వెళ్తుండగా నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.  

బాధిత కుటుంబానికి రూ.10 లక్షల సాయం 
మరోవైపు.. ఎస్తేరురాణి మృతిచెందడంతో ఆమె కుటుంబానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. తాడేపల్లి ఇన్‌చార్జి తహసీల్దార్‌ రాంప్రసాద్‌ మాట్లాడుతూ ఈ విషయాన్ని మనోరమకు తెలియజేసినట్లు చెప్పారు.
చదవండి: ఇన్విజిలేటర్‌ మందలించాడని.. ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య 

మరిన్ని వార్తలు