నాటు తుపాకీ కలకలం

30 Jul, 2020 08:45 IST|Sakshi
నాటు తుపాకీతో బెదిరింపులకు పాల్పడిన తండ్రీకొడుకులు నిందితులు ఉపయోగించిన నాటు తుపాకీ

పాతకక్షలతో హతమారుస్తామని సర్పంచ్‌కు బెదిరింపులు 

దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు 

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన 

వెల్దుర్తి(తూప్రాన్‌): నేరప్రవృత్తి కలిగిన ఓ యువకుడి వద్ద నాటు తుపాకీ వెలుగుచూడడం వెల్దుర్తి మండలంలో కలకలం సృష్టించింది. పాతకక్షలు దృష్టిలో పెట్టుకొని హతమారుస్తామంటూ సర్పంచ్‌పై తుపాకీతో పాటు కత్తులతో నలుగురు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. గమనించిన గ్రామస్తులు బెదిరింపులకు పాల్పడిన వారిని వెంబడించి పట్టుకున్నారు. అనంతరం దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన మండలంలోని మంగళపర్తి గ్రామంలో చోటు చేసుకుంది. సర్పంచ్, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మన్నె రమేశ్‌ అనే యువకుడు అతని తండ్రి యాదయ్య, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఈ నెల 27న సాయంత్రం  విజయబ్యాంకు వద్ద నిలబడి ఉన్న సర్పంచ్‌ రామకృష్ణారావుతో గొడవ పెట్టుకొని తుపాకి, కత్తులతో చంపుతానని బెదిరించారు. వీరిద్దరి మధ్య గత కొద్ది రోజులుగా పాత కక్షలు ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే గ్రామస్తుల రాకను చూసి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించగా వెంబడించి పట్టుకున్నారు. అనంతరం దేహశుద్ధి చేసి వారు ఉపయోగించిన తుపాకి, కత్తులను పోలీసులకు అప్పగించారు.  

అడవి జంతువుల వేట..! 
మన్నె రమేష్‌ గత నాలుగైదు నెలలుగా ఎస్‌బీఎంఎల్‌ కంట్రీ మేడ్‌ వెపన్‌తో స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో అడవి జంతువులను వేటాడుతున్నాడని సమాచారం. ఈ విషయమై గ్రామస్తులు అతడిని చాలాసార్లు అడిగినా సమాధానం దాటవేశాడని తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై గంగరాజు పేర్కొన్నారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచామన్నారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.  

మరిన్ని వార్తలు