అమలాపురం విధ్వంసం కేసులో మరో 25 మంది అరెస్ట్‌

29 May, 2022 05:15 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న డీఐజీ పాలరాజు, చిత్రంలో ఎస్పీలు సుబ్బారెడ్డి, రవీంద్రనాథ్‌బాబు, ఏఎస్పీలు లతామాధురి, చక్రవర్తి

ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తుల నష్టాన్ని నిందితుల నుంచి రికవరీ

నిందితుల వ్యక్తిగత ఆస్తుల సీజ్‌

144 సెక్షన్‌ మరో వారం పొడిగింపు

మరో 24 గంటలు ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేత

డీఐజీ పాలరాజు వెల్లడి

అమలాపురం టౌన్‌: అమలాపురంలో ఈ నెల 24న జరిగిన విధ్వంసకర ఘటనల్లో మరో 25 మంది నిందితులను అరెస్ట్‌ చేసినట్లు ఏలూరు రేంజ్‌ డీఐజీ జి.పాలరాజు వెల్లడించారు. ఇప్పటికే ఈ కేసుల్లో 19 మంది అరెస్ట్‌ చేశామని, తాజా అరెస్టులతో ఆ సంఖ్య మొత్తం 44కు చేరిందని చెప్పారు. ఆదివారం మరికొందరిని అరెస్ట్‌ చేస్తామన్నారు. అమలాపురంలోని ఎస్పీ కార్యాలయంలో కోనసీమ, కాకినాడ జిల్లాల ఎస్పీలు కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి, ఎం.రవీంద్రనాథ్‌బాబు, ఏఎస్పీలు లతామాధురి, చక్రవర్తితో కలసి డీఐజీ పాలరాజు శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.

శనివారం అరెస్ట్‌ చేసిన నిందితుల్లో అమలాపురం పట్టణం, అంబాజీపేట, అల్లవరం, అయినవిల్లి మండలాలకు చెందిన వారు ఉన్నారని చెప్పారు. మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ ఇళ్ల దహనం, బస్సులు, పోలీసు వజ్ర వాహనం ధ్వంసం కేసుల్లో వీరంతా నిందితులని పేర్కొన్నారు. 20 వాట్సాప్‌ గ్రూపుల స్క్రీన్‌ షాట్స్, గూగుల్‌ ట్రాక్స్, టవర్‌ లోకేషన్లు, సీసీ ఫుటేజీలు ఆధారంగా నిందితులను గుర్తించామన్నారు. ఎప్పుడు, ఎక్కడి నుంచి, ఎలా బయలుదేరాలి వంటి సూచనలు వాట్సాప్‌ గ్రూపుల్లో వెళ్లాయని తెలిపారు. 

మరో వారంపాటు 144 సెక్షన్‌
కోనసీమలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధించిన సెక్షన్‌ 144ను మరో వారం రోజులపాటు పొడిగిస్తున్నట్లు డీఐజీ చెప్పారు. ఇంటర్నెట్‌ సేవల నిలిపివేత కూడా మరో 24 గంటలపాటు కొనసాగుతుందన్నారు. సోమవారం నుంచి ఇంటర్నెట్‌ను పునరుద్ధరించే అవకాశాలున్నాయని తెలిపారు.

నష్టాలు నిందితుల నుంచే రికవరీ
ఆందోళనకారులు ఆ రోజు ప్రభుత్వ,ప్రైవేటు ఆస్తులను ధ్వసం చేసి అపార నష్టాన్ని కలిగించారని డీఐజీ పాలరాజు తెలిపారు. వీరిపై ప్రివెన్షన్‌ ఆప్‌ డ్యామేజ్‌ పబ్లిక్‌ ప్రాపర్టీ (పీడీపీపీ) యాక్ట్‌ కింద కేసులు నమోదు చేశామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తుల నష్టాలను నిందితుల వ్యక్తిగత ఆస్తుల నుంచి రికవరీ చేస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ, ఆర్‌ అండ్‌ బీ అధికారుల ద్వారా నిందితుల వ్యక్తిగత ఆస్తులను విలువ గట్టి వాటిని సీజ్‌ చేశామని చెప్పారు. ఆస్తులు ధ్వంసం చేసిన దృశ్యాలను, వాట్సాప్‌ గ్రూపుల్లో విధ్వంసానికి వ్యూహరచనతో మెసేజ్‌లను డీఐజీ పాలరాజు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా విలేకరులకు చూపించారు. 

మరిన్ని వార్తలు