MBS Jewellers: నిజాం నగల పెట్టెలు.. విడిపించాక పంచుకుందాం 

22 Dec, 2021 13:40 IST|Sakshi

 రాజేష్‌ అగర్వాల్‌ నుంచి  రూ.50.8 కోట్లు స్వాహా

ఎంబీఎస్‌ జ్యువెలర్స్‌ సుఖేష్‌ గుప్తా వ్యవహారమిది

ఇద్దరిపై కేసు నమోదు  

సాక్షి, హైదరాబాద్‌: ఎంబీఎస్‌ జ్యువెలర్స్‌ నిర్వాహకుడు సుఖేష్‌ గుప్తపై మరో కేసు నమోదైంది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న నిజాం నగలను విడిపించి, పంచుకుందామంటూ నగరానికి చెందిన రాజేష్‌ అగర్వాల్‌ అనే వ్యక్తికి ఎర వేసి రూ.50.8 కోట్లు తీసుకుని మోసం చేశారు. బాధితుడు కోర్టును ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాల్సిందిగా కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నేరం నిరూపించడానికి అవసరమైన ఆధారాలు సేకరిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు.

నిజాంకు చెందిన నగలతో కూడిన ఐదు బాక్సులు సర్వే, సెటిల్‌మెంట్‌ అండ్‌ ల్యాండ్‌ రికార్డుల కమిషనర్‌ ఆధీనంలో ఉన్నాయని, వీటిని విడిపిద్దామంటూ సుఖేష్‌ గుప్తా, మహ్మద్‌ జకీర్‌ ఉస్మాన్‌ అనే వ్యక్తితో కలిసి రాజేష్‌ అగర్వాల్‌ను సంప్రదించారు. నిజాం వారసుల నుంచి నిరభ్యంతర పత్రాలు (ఎన్‌ఓసీ) తీసుకోవడం ద్వారా ఇది సాధ్యమవుతుందంటూ నమ్మబలికారు. వారితో సంప్రదింపులు జరపడానికి, ఎన్‌ఓసీలు తీసుకోవడానికి కొంత ముట్టజెప్పాల్సి ఉంటుందంటూ రాజేష్‌ను నమ్మించారు. 5 నగల పెట్టెలు తమ చేతికి వచ్చాక పంచకుందామంటూ పత్రాలు సైతం రాసుకున్నారు.
చదవండి: హైదరాబాద్‌లో ఒమిక్రాన్‌ గుబులు: ఆరుగురిలో నలుగురు చిక్కారు.. ఏ ఏరియా అంటే..

వీరి మాటలు నమ్మిన రాజేష్‌ ఆషిష్‌ రియల్టర్స్‌తో పాటు ఎంబీఎస్‌ జ్యువెలర్స్‌ సంస్థలకు ఆన్‌లైన్‌ ద్వారా రూ.50.8 కోట్లు చెల్లించారు. ఈ మొత్తం తమ చేతికి వచ్చాక నిందితులు తనను మోసం చేశారంటూ బాధితుడు న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో సుఖేష్‌ గుప్తతో పాటు జకీర్‌ ఉస్మాన్‌పైనా కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు. 
చదవండి: ఒమిక్రాన్‌ దడ, థర్డ్‌వేవ్‌ హెచ్చరిక.. ‘బూస్టర్‌’ వైపు పరుగులు..

మరిన్ని వార్తలు