తంటికొండ ఘటన: ఆగని మృత్యుఘోష 

2 Nov, 2020 08:54 IST|Sakshi
చికిత్స పొందుతూ మృతి చెందిన చాగంటి సుజాత (ఫైల్‌)-ప్రమాదం జరిగిన రోజే మృతి చెందిన హేమనీ శ్రీలలిత (ఫైల్‌)  

తంటికొండ ఘటనలో మరొకరి మృతి

ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య

తల్లీ కుమార్తెల మరణంతో గాదరాడలో విషాదం 

గోకవరం(తూర్పుగోదావరి): ఆ రక్తపు మరకలు ఇంకా మాయలేదు.. ఆక్రందనలు ఆగలేదు.. మృత్యుఘోష వీడలేదు.. తంటికొండ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ఘాట్‌ రోడ్డులో గురువారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మరణించడంతో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోరుకొండ మండలం గాదరాడకు చెందిన చాగంటి సుజాత (38) ఆదివారం మృతి చెందినట్టు గోకవరం ఎస్సై పి.చెన్నారావు చెప్పారు. ప్రమాద స్థలంలోనే ఐదుగురు మృత్యువాత పడగా, ఆస్పత్రిలో సుజాత కుమార్తె హేమనీ శ్రీలలిత (13), పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపురం గ్రామానికి చెందిన సోమరౌతు గోపాలకృష్ణ (72) దుర్మరణం పాలయ్యారు. మృతురాలు సుజాత పెళ్లి కుమారుడికి  సోదరి. ఈమెకు గాదరాడకు చెందిన పెద్దరాజుతో 16 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి కుమారుడితో పాటు కుమార్తె హేమనీ శ్రీలలిత ఉన్నారు.

సోదరుడి వివాహం నేపథ్యంలో  కుటుంబ సభ్యులతో కలసి ఠాకూరుపాలెం వెళ్లింది. తమ్ముడి వివాహాన్ని దగ్గరుండి జరిపించిన ఆమె అనంతరం జరిగిన దుర్ఘటనలో కుమార్తెతో పాటు ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన కొద్ది సేపటికే కుమార్తె మృతి చెందగా తీవ్రంగా గాయపడిన సుజాత చికిత్స పొందుతూ ఆదివారం ప్రాణాలు విడిచింది. తల్లీ కుమార్తెల మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. మృతురాలి సోదరి గోకవరానికి చెందిన కంబాల భాను (33) ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే మృతి చెందింది. ఇదిలా ఉంటే ఈ ప్రమాదంలో గాయపడిన గోకవరానికి చెందిన కంబాల వెంకటరమణ, కంబాల మోహన సీతామలక్షి్మ, ఠాకూరుపాలేనికి చెందిన సింహాద్రి చంద్ర, కాపవరానికి చెందిన జాజుల లక్ష్మన్న, జాజుల లక్షి్మ, గాదరాడకు చెందిన చాగంటి నూకరత్నం, పశి్చమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం తాళ్లపురం గ్రామానికి చెందిన సోమరౌతు వెంకటలక్షి్మ వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు పోలీసులు తెలిపారు.

డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం 
తాడితోట (రాజమహేంద్రవరం): తంటికొండ దేవస్థానంలో ఘోర రోడ్డు ప్రమాదం డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే జరిగిందని దర్యాప్తు అధికారి, రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా సెంట్రల్‌ డీఎస్పీ జేవీ సంతోష్‌ తెలిపారు. వ్యాన్‌పై వెళ్లిన పెళ్లి బృందం కొండ పైనుంచి కిందకు దిగుతుండగా వాహనం అదుపు తప్పి పడిపోయిన సంఘటనలో ఎనిమిది మంది మృతి చెందారన్నారు. ఈ ఘటనలో వ్యాన్‌ డ్రైవర్‌ మద్యం తాగాడా లేదా అనేది పోస్టుమార్టం రిపోర్టును బట్టి తేలుతుందని ఆయన చెప్పారు.    

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు