సచిన్‌ జోషిపై ‘గుట్కా’ కేసు

16 Oct, 2020 02:51 IST|Sakshi

వివిధ కంపెనీల ట్రేడ్‌మార్క్‌లను ఉల్లంఘించి పాన్‌ మసాలా తయారీ

గగన్‌పహాడ్‌లోని కంపెనీపై శంషాబాద్‌ పోలీసుల దాడి

రూ. 1.25 కోట్ల విలువజేసే సరుకు స్వాధీనం  

శంషాబాద్(హైదరాబాద్‌)‌: ప్రముఖ వ్యాపారవేత్త, సినీ హీరో అయిన సచిన్‌ జోషిపై హైదరా బాద్‌లో మరో ‘గుట్కా’ కేసు నమోదైంది. ట్రేడ్‌మార్క్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ పాన్‌ మసాలా తయారు చేస్తున్నారంటూ అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు సచిన్‌తోపాటు ఆయన తండ్రి, గోవా పాన్‌ మసాలా కంపెనీ యజమాని జేఎం జోషిపై చీటింగ్‌ కేసు నమోదు చేశారు. గగన్‌పహాడ్‌లో వారు నిర్వహి స్తున్న గోల్డెన్‌ ఫింగర్స్‌ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ కంపెనీపై దాడులు చేసి రూ. 1.25 కోట్ల విలువజేసే సరుకును స్వాధీనం చేసుకు న్నారు. అలాగే కంపెనీని సీజ్‌ చేశారు. శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి కథనం ప్రకారం జేఎం జోషి, సచిన్‌ జోషిలు గగన్‌ పహాడ్‌లో గోల్డెన్‌ ఫింగర్‌ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ పేరుతో ఓ కంపెనీని నిర్వహిస్తున్నారు. సెవెన్‌హిల్స్‌ కంపెనీకి చెందిన మాణిక్‌ చంద్‌ పాన్‌ మసాలాను తయారు చేసి దేశవ్యాప్తంగా మార్కెటింగ్‌ చేస్తున్నారు.

అయితే ఆ ట్రేడ్‌మార్క్‌ తమదని, దాన్ని అతిక్రమించి సచిన్, ఆయన తండ్రి వాడు తూ వ్యాపారం చేస్తున్నారంటూ సురేశ్‌ రావు అనే వ్యక్తి ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన సీఐ ప్రవీణ్‌ నేతృత్వంలోని బృందం గగన్‌పహడ్‌లోని గోల్డెన్‌ ఫింగర్స్‌ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ కంపెనీపై గురువారం దాడులు చేసింది. 60 బ్యాగుల మానిక్‌ చంద్‌ పాన్‌ మసాలా, వెయ్యి బ్యాగుల గోవా పాన్‌ మసాలా, 60 బ్యాగుల వజిర్‌ పాన్‌ మసాలాతోపాటు మడిసరుకు, ప్యాకింగ్‌ కవర్లు, మిక్సర్‌ యంత్రాలను స్వాధీనం చేసుకుంది. అయితే ట్రేడ్‌మార్క్‌ యజమానులు ఎవరనే దానిపై చెన్నైలోని ట్రేడ్‌మార్క్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి లేఖ రాశామని, అక్కడి నుంచి వచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని డీసీపీ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. ఈ ఏడాది మార్చిలో బహదూర్‌పుర పోలీసు స్టేషన్‌లో సచిన్‌ జోషిపై ఓ కేసు నమోదైంది. ఈ కేసులో అతను నాలుగో నిందితుడిగా ఉన్నాడు. ఎన్‌వోసీ జారీ చేస్తే నాలుగు రోజుల క్రితం ముంబై నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అనంతరం ముంబై వెళ్లిపోయాడు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు