సారీ, నేను ఓడిపోయాను..!

30 Jan, 2024 06:02 IST|Sakshi

అమ్మానాన్నలకు లేఖ రాసి కోటాలో విద్యార్థిని ఆత్మహత్య

కోటా: పరీక్షల ఒత్తిడికి మరో నిండు ప్రాణం బలైంది. రాజస్తాన్‌లోని కోటాలో జేఈఈకి ప్రిపేర్‌ అవుతున్న నిహారిక సింగ్‌(18) అనే విద్యార్థిని ఉరేసుకుని తనువు చాలించింది. ‘‘మమ్మీ, పాపా! నేను జేఈఈ సాధించలేను. నేను ఓడిపోయాను. నేను మంచి కూతుర్ని కాను. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను. సారీ, నాకిక వేరే దారి లేదు’’ అని పేర్కొన్న సూసైడ్‌ నోట్‌ ఆమె గదిలో పోలీసులకు లభించింది.

స్థానిక శివ విహార్‌ కాలనీలో కుటుంబంతో ఉంటున్న నిహారిక ఈ నెల 30, 31వ తేదీల్లో జేఈఈ పరీక్ష రాయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. చదువుల్లో ఒత్తిడిని తట్టుకుని, పరీక్ష రాయ లేకనే ఉరివేసుకున్నట్లు సూసైట్‌ నోట్‌ను బట్టి అర్థమవుతోందని వారన్నారు. ఉదయం 10 గంటలైనా నిహారిక బయటికి రాకపోవడంతో అమ్మమ్మ గది తలుపు తట్టింది. ఎంతకూ లోపలి నుంచి స్పందన లేకపోవడంతో కుటుంబసభ్యులు తలుపులు పగులగొట్టి చూడగా, వెంటిలేటర్‌కు వేసుకున్న ఉరికి వేలాడుతూ నిహారిక విగతజీవిగా కనిపించింది.

ఈ పరిణామంతో వారు హతాశులయ్యారు. చదువులో ముందుండే నిహారిక జేఈఈ పరీక్షపై ఒత్తిడికి గురవుతోందని ఆమె కుటుంబసభ్యుడొకరు చెప్పారు. జేఈఈతోపాటు ఎక్కువ స్కోరు కోసం 12వ తరగతి పరీక్షను సైతం ఆమె రాయాల్సి ఉందన్నారు. నిహారిక తండ్రి స్థానిక బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. ఝలావర్‌ జిల్లా అకౌడాఖుర్ద్‌కు చెందిన ఈ కుటుంబం మూడేళ్లుగా కోటాలో ఉంటోంది. కోటాలో వారం వ్యవధిలో చోటుచేసుకున్న విద్యార్థుల ఆత్మహత్యల్లో ఇది రెండోదని పోలీసులు పేర్కొన్నారు. నీట్‌కు ప్రిపేరవుతున్న యూపీకి చెందిన మహ్మద్‌ జయిద్‌ జనవరి 13న హాస్టల్‌ గదిలో ఉరేసుకున్నాడు. కోటాలో గత ఏడాది 26 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు.

whatsapp channel

మరిన్ని వార్తలు