శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో మరో కీలక ట్విస్ట్‌

16 Feb, 2024 19:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫ్లాట్ కొనుగోలుకు శివ బాలకృష్ణ భారీగా చెల్లించిన  నగదును ఏసీబీ అధికారులు సీజ్‌ చేశారు. శ్రీకృష్ణ నిర్మాణ సంస్థలో ఫ్లాట్ కొనుగోలుకు బాలకృష్ణ చెల్లించిన రెండు కోట్ల 70 లక్షల రూపాయలను నగదును సీజ్‌ చేశారు. బాలకృష్ణ ఇంకా ఏ ఏ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాడనే దానిపై ఏసీబీ విచారణ చేస్తోంది. బినామీల పేర్లతో భారీగా ఆస్తుల కొనుగోలుపై ఆరా తీస్తోంది. పలు నిర్మాణ సంస్థల్లో పెట్టుబడులపై ఏసీబీ దృష్టి పెట్టింది.

కాగా, శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో రోజుకో విస్తుపోయే విషయం వెలుగు చూస్తోంది. తన పేరిటే కాకుండా.. ఇంట్లోవాళ్లు, దగ్గరి.. దూరపు బంధువుల పేరిట కూడా ఆయన భారీగా ఆస్తుల్ని జమ చేశాడు. ఆఖరికి తన దగ్గర పని చేసేవాళ్లనూ వదల్లేదాయన.  తాజాగా.. ఆయన దగ్గర అటెండర్‌, డ్రైవర్‌గా పని చేసిన వ్యక్తుల్ని అవినీతి నిరోధక శాఖ(ACB) అరెస్ట్‌ చేసింది. ఈ ఇద్దరి పేరిటా భారీగానే బినామీ ఆస్తుల్ని శివ బాలకృష్ణ కూడబెట్టి ఉంటాడన్న అనుమానాల నేపథ్యంలో అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించింది. 

శివబాలకృష్ణ దగ్గర అటెండర్‌గా పని చేసిన హబీబ్‌, డ్రైవర్‌ గోపీలను ఏసీబీ తాజాగా అరెస్ట్‌ చేసింది. శివ బాలకృష్ణకు లంచాలు చేరవేయడంలో ఈ ఇద్దరూ కీలకంగా వ్యహహరించారని .. ప్రతిఫలంగా ఇద్దరి పేర్లపైనా బాలకృష్ణ ఆస్తులు కూడబెట్టాడని సమాచారం. ఈ క్రమంలోనే.. డ్రైవర్‌ గోపీకి కాస్ట్‌లీ హోండా సిటీకారును శివ బాలకృష్ణ గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీళ్లిద్దరి పేరిట ఉన్న బినామీ ఆస్తుల వివరాలను గుర్తించే పనిలో ఉంది ఏసీబీ.

ఇదీ చదవండి: తిరుపతి జూ ఘటన.. తేలని ప్రశ్నలు!

whatsapp channel

మరిన్ని వార్తలు