మణిపూర్‌ నుంచి మరో ఘోరం వెలుగులోకి!.. వివాహితపై గ్యాంగ్‌ రేప్‌

10 Aug, 2023 20:27 IST|Sakshi

ఇంఫాల్‌: మణిపూర్‌లో శాంతిభద్రతలు ఒకమోస్తరుగా అదుపులోకి వస్తున్న క్రమంలో..  గత మూడు నెలల కాలంలో చోటు చేసుకున్న నేరాలు-ఘోరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో సహాయక శిబిరానికి చేరుకున్న ఓ వివాహిత తనపై జరిగిన అఘాయిత్యంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది. 

బాధితురాలి కథనం ప్రకారం.. చురాచందాపూర్‌ జిల్లాలో కొందరు దుండగుల చేతుల్లో ఓ వివాహిత సామూహిక అత్యాచారానికి గురైంది. అత్యంత పాశవికంగా వేధిస్తూ మరీ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు వాళ్లు. ఈ క్రమంలో బయటికి చెప్పుకుంటే కుటుంబ పరువు పోతుందనే భయంతో ఇన్నాళ్లూ ఆమె మౌనంగా ఉండిపోయింది. అయితే ఆ లైంగిక దాడి తర్వాత ఆమె ఆరోగ్యంగా బాగా దెబ్బతింది.  

ఆమె మంగళవారం ఓ ప్రభుత్వాసుపత్రిని సందర్శించగా.. అక్కడి వైద్యులు జరిగిందంతా తెలుసుకుని ఆమెకు వైద్యంతో పాటు మనోధైర్యం అందించారు. ఆపై బుధవారం ఆమె బిష్ణుపూర్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 

(జీరో ఎఫ్‌ఐఆర్‌ అంటే.. బాధితులు ఏ స్టేషన్‌లో ఫిర్యాదు చేయొచ్చు. దాని ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు కావొచ్చు. నేరం జరిగిన స్టేషన్‌ పరిధిలోనే ఫిర్యాదు చేయాలనే రూల్‌ లేదు.  ఆ తర్వాత నేరం జరిగిన పరిధిలోకి ఆ ఎఫ్‌ఐఆర్‌ను పంపిస్తారు.)

బాధితురాలి ఆవేదన..
మే 3వ తేదీ సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో.. కొందరు దుండగులు మా ప్రాంతంలోని ఇళ్లను తగలబెట్టారు. ఈ క్రమంలో నేను ఉంటున్న ఇల్లు కాలిపోతుండగా.. ప్రాణభయంతో నేను(37) నా ఇద్దరు కొడుకుల్ని, నా భర్త సోదరి ఆమె ఇద్దరు బిడ్డలతో కలిసి పారిపోయేందుకు ప్రయత్నించాం. నా అల్లుడిని వీపున వేసుకుని.. ఇద్దరు కొడుకులతో సహా పారిపోయే యత్నం చేశాం. ఆ సమయంలో కింద పడిపోయా. ముందు  చంటిబిడ్డతో పరిగెడుతున్న నా భర్త సోదరి వెనక్కి వచ్చి తన బిడ్డనూ,  నా ఇద్దరు బిడ్డలను తీసుకుని పరుగులు తీసింది. కిందపడ్డ నేను పైకి లేవలేకపోయా. ఆ సమయంలో ఐదారుగురు దుండగులు చుట్టుముట్టారు. నా బిడ్డలు అరుస్తూ నావైపు చూస్తూనే పారిపోసాగారు. ఆ కీచకులు లైంగికంగా వేధిస్తూ.. నాపై దాడికి పాల్పడ్డారు. మృగచేష్టలతో తీవ్రంగా గాయపడిన నేను.. ఆ తర్వాత శరణార్థ శిబిరంలో ఉన్న నా వాళ్లను చేరుకున్నా. ఆ గాయం నన్ను మానసికంగా ఎంతో కుంగదీసింది. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. ఆరోగ్యం దిగజారడంతో వైద్యుల్ని సంప్రదించగా.. వాళ్లకు విషయం చెప్పాల్సి వచ్చింది. వాళ్ల సలహా మేరకే పోలీసులకు ఫిర్యాదు చేశా. నాకు న్యాయం జరుగుతుందనే ఆశిస్తున్నా అని బాధితురాలు తన ఆవేదనను పంచుకుంది.

ఇదిలా ఉంటే.. మణిపూర్‌ అల్లర్లు-హింస కారణంగా మే 3వ తేదీ నుంచి జులై 30వ తేదీ వరకు 6,500దాకా కేసులు నమోదు చేసినట్లు మణిపూర్‌పోలీస్‌ శాఖ సుప్రీం కోర్టుకు తెలియజేసింది. వీటిలో ఇళ్ల ధ్వంసం కేసులే ఎక్కువగా ఉన్నట్లు సుప్రీంకు సమర్పించిన నివేదికలో వెల్లడించింది. అయితే పోలీస్‌ శాఖ వివరణతో సంతృప్తి చెందని సుప్రీం.. ప్రత్యేక దర్యాప్తు బృందాలతో కేసుల విచారణ జరిపించాలని మణిపూర్‌ ప్రభుత్వాన్ని ఆదేశిచింది. మరోవైపు గత నెలలో మణిపూర్‌ నుంచి ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి మరీ లైంగిక దాడి జరిపిన ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు