భూ కుంభకోణం కేసులో మరొకరి అరెస్ట్‌ 

20 Oct, 2021 04:09 IST|Sakshi
నిందితుడి వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి

తహసీల్దార్‌ సహా మరికొందరు పరారీలోనే.. 

వెల్లడించిన గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి  

చిల్లకూరు: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నం భూ కుంభకోణం కేసులో మరో నిందితుడిని మంగళవారం అరెస్ట్‌ చేసినట్లు గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. చిల్లకూరులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ్మినపట్నం సమీపంలో ఉన్న పోర్టు భూములను వెబ్‌ల్యాండ్‌లో మార్పులుచేసి ఇతరుల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేశారని చెప్పారు. దీనిపై గూడూరు ఆర్డీవో మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి ఇప్పటికే నలుగురిని రిమాండ్‌కు తరలించామన్నారు. ఈ కేసులో పొదలకూరు రెవెన్యూ కార్యాలయం కంప్యూటర్‌ ఆపరేటర్‌ సాసం నరసయ్యను మంగళవారం చిల్లకూరు బైపాస్‌ వద్ద సీఐ శ్రీనివాసులరెడ్డి అరెస్ట్‌ చేశారని తెలిపారు.

రాపూరు మండలం సైదాసుపల్లి గ్రామానికి చెందిన సాసం నరసయ్య నెల్లూరులో ఉంటున్నారని, ఆయనే చిల్లకూరు రెవెన్యూ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌ నవీన్‌ను నిందితులకు పరిచయం చేశాడని చెప్పారు. వీరంతా ముఠాగా ఏర్పడి సర్వే నంబర్‌ 94–3లో ఉన్న 271.80 ఎకరాల్లో 209 ఎకరాలను 327 సర్వే నంబర్‌కు మార్చి 327–3ఏ2–హెచ్‌1–హెచ్‌11 సబ్‌ డివిజన్‌ చేసి ఆన్‌లైన్‌లో 11 మంది పేర్లతో నమోదు చేశారని వివరించారు. ఈ కేసులో తహసీల్దార్‌ గీతావాణి, నరసయ్య, శేఖరరెడ్డి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ నవీన్‌ పరారీలో ఉన్నారని చెప్పారు. వారిని పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డీఎస్పీ వెంట గూడూరు రూరల్‌ సీఐ శ్రీనివాసులరెడ్డి, చిల్లకూరు ఎస్‌ఐ అజయ్‌కుమార్‌ ఉన్నారు.   

మరిన్ని వార్తలు