నారాయణ, లింగమనేని దేశం విడిచి వెళ్లరాదని హైకోర్టు ఆదేశం

7 Sep, 2022 05:14 IST|Sakshi

దేశం విడిచి వెళ్లరాదని హైకోర్టు ఆదేశం 

సాక్షి, అమరావతి: అమరావతి మాస్టర్‌ ప్లాన్, ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ డిజైన్ల ముసుగులో సాగిన భూ దోపిడీపై ఇటీవల సీఐడీ నమోదు చేసిన కేసులో నిందితులుగా ఉన్న మాజీమంత్రి పొంగూరు నారాయణ, వ్యాపారవేత్త లింగమనేని రమేశ్, అతని సోదరుడు లింగమనేని వెంకటసూర్య రాజశేఖర్, రామకృష్ణ హౌసింగ్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ కేపీవీ అంజనీకుమార్‌లకు హైకోర్టు ఊరటనిచ్చింది.

సీఐడీ నమోదు చేసిన కేసులో వారికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. కానీ, కొన్ని షరతులు విధించింది. ఈ కేసులో చార్జిషీట్‌ దాఖలు చేసేంత వరకు దేశంలోనే ఉండాలని నిందితులను హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ దేశం విడిచి వెళ్లాలంటే సంబంధిత కోర్టు అనుమతి తీసుకోవాలని వారికి స్పష్టంచేసింది. రూ.50వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మంగళవారం తీర్పు వెలువరించారు.

ఆళ్ల ఫిర్యాదు.. సీఐడీ కేసు..
అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌ డిజైన్ల మార్పు ముసుగులో భారీ భూ దోపిడీ జరిగిందంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా మాజీ సీఎం చంద్రబాబునాయుడు, మాజీమంత్రి పొంగూరు నారాయణ, వ్యాపారవేత్త లింగమనేని రమేశ్, అతని సోదరుడు లింగమనేని వెంకటసూర్య రాజశేఖర్, రామకృష్ణ హౌసింగ్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ కేపీవీ అంజనీకుమార్‌ తదితరులపై సీఐడీ ఈ ఏడాది మే 9న కేసు నమోదు చేసింది.

ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ నారాయణ, లింగమనేని సోదరుడు, అంజనీకుమార్‌ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు విచారణ జరిపారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి జూన్‌ 17కు తీర్పును వాయిదా వేశారు. తీర్పు రిజర్వ్‌ చేసిన రెండున్నర నెలల తరువాత న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. 

మరిన్ని వార్తలు