గంటా అనుచరుడు దొరబాబు ఇంట్లో సీఐడీ సోదాలు

15 Sep, 2022 12:45 IST|Sakshi

విశాఖపట్నం: అమరావతి అసైన్డ్‌ భూముల కుంభకోణంలో అరెస్టయిన ఏయూ దూరవిద్య కేంద్రం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (కాంట్రాక్ట్‌) కె.దొరబాబు ఇంట్లో సీఐడీ పోలీసులు బుధవారం తనిఖీలు చేసినట్లు తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే సీఐడీ పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. 

టీడీపీ హయాంలో గంటాకు అనుచరునిగా ఉంటూ అమరావతి అసైన్డ్‌ భూముల వ్యవహారంలో దొరబాబు పాత్ర ఉండటంతో సీఐడీ పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఏయూ దూరవిద్య కేంద్రంలో ఆయన గదిని ఏయూ చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ ఆధ్వర్యంలో ఏయూ దూరవిద్య కేంద్రం అధికారులు సీజ్‌ చేశారు.

నారాయణకు మధ్యంతర ముందస్తు బెయిల్‌
సాక్షి, అమరావతి: అమరావతి రాజధాని ముసుగులో దళిత, బలహీనవర్గాల రైతులకు చెందిన 1,100 ఎకరాల అసైన్డ్, లంక భూములను కాజేసిన వ్యవహారంపై సీఐడీ నమోదు చేసిన కేసులో టీడీపీ మాజీ మంత్రి పొంగూరు నారాయణకు హైకోర్టు బుధవారం మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ నెల 14 నుంచి డిసెంబర్‌ 14 వరకు మూడు నెలలు మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.


ఈ మూడు నెలలూ నారాయణను అరెస్ట్‌ చేయవద్దని సీఐడీని ఆదేశించింది. తుది విచారణను డిసెంబర్‌ 15కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. సీఐడీ 2020లో నమోదు చేసిన ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ నారాయణ దాఖలు చేసిన వ్యాజ్యంపై కోర్టు బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు.

రాజధానికి సంబంధించిన మరో కేసులో హైకోర్టు పిటిషనర్‌కు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసి, చికిత్సకు అమెరికా వెళ్లేందుకు అనుమతి ఇచ్చిందన్నారు. ఈ వాదనను ఏఏజీ తోసిపుచ్చారు. పిటిషనర్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదై ఉన్నందున, ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదని చెప్పారు. ప్రయాణానికి ఒక్క రోజు ముందు పిటిషన్‌ దాఖలు చేశారని తెలిపారు. వాదనలు విన్న కోర్టు నారాయణకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. (క్లిక్ చేయండి: నారాయణ స్వాహా.. బంధుగణంతో ‘అసైన్డ్‌’ మేత)

మరిన్ని వార్తలు