రెండేళ్ల తర్వాత సొంతూరికి.. రెప్పపాటులో ప్రమాదం, దంపతుల దుర్మరణం

28 Apr, 2022 12:20 IST|Sakshi

సాక్షి, చివ్వెంల (సూర్యాపేట):  కరోనా వల్ల స్వదేశానికి రాలేకపోయిన ఆ కుటుంబం రెండేళ్ల తర్వాత.. రెక్కలు కట్టుకుని వాలిపోయింది. కానీ, ఊహించని పరిణామం ఆ కుటుంబంలో విషాదం నింపింది. రెప్పపాటులో జరిగిన ప్రమాదం దంపతులను బలిగొనడంతో పాటు వాళ్ల ఇద్దరు పిల్లలకు కన్నవాళ్లను దూరం చేసింది. జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలో బుధవారం తెల్లవారుజామున డివైడర్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో దంపతులు దుర్మరణం చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. 

ఎన్టీఆర్‌ జిల్లా రెడ్డిగూడెం మండల కేంద్రానికి చెందిన పెద్దగమళ్ల హేమాంబరధర్, రజిత దంపతులు పదేళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. వారికి కుమార్తె భవాగ్న, కుమారుడు పల్విత్‌ ఉన్నారు. రజిత ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తుండగా, హేమాంబరధర్‌ ప్రైవేట్‌ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. రెండేళ్ల క్రితమే ఆడిలైడ్‌లో ఇల్లు కోనుగోలు చేశారు. కరోనాతో ఇంతకాలం ఆ కుటుంబం భారత్‌కు రాలేకపోయింది. తిరిగి ఆంక్షలు ఎత్తివేత, విమాన ప్రయాణాల పునరుద్ధరణతో తిరిగి వచ్చింది.

స్వగ్రామానికి వెళ్తూ.. 
హేమాంబరధర్‌ కుటుంబ సభ్యులు ఈ నెల 25న హైదరాబాద్‌కు వచ్చారు. అక్కడ బంధువుల ఇంట్లో ఒకరోజు ఉండి, 26న రాత్రి పది గంటల సమయంలో తమ గ్రామానికి చెందిన తిరుపతిరావు కారు కిరాయికి మాట్లాడుకుని రెడ్డిగూడెం బయలుదేరారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం జి.తిరుమల్‌గిరి గ్రామ శివారులో విజయవాడ–హైదరాబాద్‌ రహదారిపై కారు కల్వర్టును ఢీకొట్టడంతో హేమంబరధర్‌(47) అక్కడికక్కడే మతిచెందగా, రజిత సూర్యాపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. వారి పిల్లలు భవాగ్న, పల్విత్, డ్రైవర్‌ తిరుమలరావు తీవ్రంగా గాయపడ్డారు. వారు విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎస్‌ఐ విష్ణుమూర్తి ఘటన స్థలాన్ని పరిశీలించారు. కారు డ్రైవర్‌ నిద్రమత్తుతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు