ఈఎస్‌ఐ కుంభకోణం: త్వరలోనే చార్జ్‌షీట్‌

19 Aug, 2020 19:41 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన 150 కోట్ల ఈఎస్‌ఐ స్కాంలో అవినీతి నిరోధక శాఖ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతో సహా 12 మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 19 మందిపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న మాజీ మంత్రి పితాని తనయుడితో పాటు మిగిలిన వారి కోసం ఏపీ, తెలంగాణలో గాలిస్తున్నారు. ఈ క్రమంలో విచారణలో భాగంగా కాల్‌ సెంటర్‌లో చూపించిన కాల్స్‌ అన్నీ నకిలీవేనని అధికారులు గుర్తించారు.

ఈ విషయం గురించి  ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ కాల్స్‌ని లిస్ట్‌లో చూపించి బిల్లులు తీసుకున్నట్లు విచారణలో తేలిందని చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే 12 మందిని అరెస్ట్‌ చేశామన్నారు. మరో తొమ్మిది మందికి  సంబంధించి ఈ కేసులో ఆధారాలు సేకరించామని తెలిపారు. త్వరలోనే చార్జిషీట్ దాఖలు చేస్తామని , నిందితుల సంఖ్య కూడా ఇరవై ఐదుకు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

‘‘గత ప్రభుత్వ హయాంలో మందులు, సర్జికల్, ల్యాబ్, మెడికల్, ఫర్నిచర్ కొనుగోలులో జరిగిన అవినీతిపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాం. మందులు కొనుగోలులో ప్రభుత్వ నిబంధనలను పాటించలేదని తేలింది. నిర్ణీత ధర కంటే ఎక్కువ రేట్లకు మందులను కొన్నట్టు గుర్తించాం. రూ.103  కోట్లు విలువ చేసే మందులు నాన్ కాంట్రాక్టులో కొన్నారు. లక్ష పైన కొనే వాటిని ఈ ప్రోక్యూర్లో కొనాలి, అయితే డైరెక్టర్స్ అలా కాకుండా కొన్ని సంస్థలతో కుమ్మక్కై అవకతవకలకు పాల్పడ్డారు. ఈ టెండర్లు పక్కన పెట్టి 400 కోట్లకు కొనుగోళ్లు జరిపారు. ధనలక్ష్మి అనే ఉద్యోగిని కుమారుడు అమరావతి మెడికల్స్, తిరుమల మెడికల్స్ ఏర్పాటు చేసి అవకతవకలకు పాల్పడినట్లు తేలింది. వాటిని  2019 తర్వాత మూసేసిన్నట్లు గుర్తించాం’’ అని రవికుమార్‌ తెలిపారు.

కింద ఆసుపత్రి నుంచి స్టాక్ ఆడిగితేనే మందుల సరఫరా జరగాలని.. అయితే డాక్టర్ జనార్దన్ అనే వ్యక్తి మాత్రం 4 కోట్లు విలువైన మందులు అవసరం లేకుండా కొన్నారని పేర్కొన్నారు. కొన్న మందులను ఏం చేశారో తెలీయదని, స్టాక్ బోర్డు లెక్కలు అందుకు భిన్నంగా ఉన్నాయన్నారు. ప్రమోద్ రెడ్డి, నీరజ్ రెడ్డి అనే వ్యక్తులకు మంత్రి అచ్చెన్నాయుడు టెలీ సర్వీసెస్ పేరుతో కాంట్రాక్టు ఇప్పించారని రవికుమార్ తెలిపారు. పరారీలో ఉన్న నిందితులు ముందస్తు బెయిల్ తీసుకొని విచారణ నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ కేసులో నిందితులందరినీ పట్టుకొని త్వరలోనే న్యాయస్థానం ముందు నిలబెడతామన్నారు.

మరిన్ని వార్తలు