సీఎంఆర్‌ఎఫ్ నకిలీ చెక్కుల వ్యవహారంపై ఏసీబీ విచారణ

20 Sep, 2020 18:44 IST|Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) నకిలీ చెక్కుల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీరియస్ అయింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ వ్యవహారంపై ఏసీబీ విచారణకు ఆదేశించారు. సీఎం సహాయ నిధి నుంచి రూ.112 కోట్లు కొల్లగొట్టే కుట్ర వెలుగు చూసిన సంగతి తెలిసిందే. కర్ణాటక, ఢిల్లీ, కోల్‌కతాలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఆంధ్రప్రదేశ్‌ సీఎం సహాయనిధి నుంచి డబ్బులు కొట్టేసేందుకు కుట్రలు పన్నగా.. బ్యాంకు అధికారులు అప్రమత్తం కావడంతో విషయం వెలుగు చూసింది. 

కాగా, సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో రెవెన్యూ ఉన్నతాధికారులు ఏసీబీ డైరెక్టర్‌కు లేఖ రాశారు. మరోవైపు ఫాబ్రికేటెడ్‌ చెక్కులపై తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఇప్పటికే కేసు నమోదైంది. రెవిన్యూ శాఖ అసిస్టెంట్‌ సెక్రటరీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగళూరు సర్కిల్‌, మంగళూరులోని మూడ్‌బద్రి శాఖకు రూ.52.65 కోట్ల చెక్కు, ఢిల్లీలోని సీసీపీసీఐకి రూ.39,85,95,540 చెక్కు, కోల్‌కతా సర్కిల్‌లోని మోగ్‌రాహత్‌ శాఖకు రూ.24.65 కోట్ల చెక్కులను క్లియరెన్స్‌ కోసం గుర్తు తెలియని వ్యక్తులు ఆయా బ్యాంకుల్లో సమర్పించారు. వాటిపై సీఎంఆర్‌ఎఫ్‌, రెవెన్యూశాఖ, సెక్రటరీ టు గవర్నమెంట్‌ స్టాంపులు కూడా ఉన్నాయి. ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా సర్కిళ్లకు చెందిన.. బ్యాంకు అధికారులు వెలగపూడిలోని ఎస్‌బీఐ బ్రాంచికి ఫోన్‌ చేయడంతో కుంభకోణం బట్టబయలైంది.
(చదవండి: బెడిసికొట్టిన బడా మోసం)

మరిన్ని వార్తలు