అనంతబాబుపై కేసుల వివరాలివ్వండి: హైకోర్టు

10 Sep, 2022 05:18 IST|Sakshi

మృతుని పోస్టుమార్టం నివేదిక సమర్పించండి 

పోలీసులకు హైకోర్టు ఆదేశం.. విచారణ 14కి వాయిదా

సాక్షి, అమరావతి: ఎమ్మెల్సీ అనంతబాబుపై ఉన్న కేసులు, కింది కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్, మృతుడు సుబ్రహ్మణ్యం పోస్టుమార్టం నివేదికను తమ ముందుంచాలని హైకోర్టు శుక్రవారం పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవి ఉత్తర్వులు జారీచేశారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ అనంతబాబు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనితోపాటు 90 రోజుల్లో పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేయనందుకు తనకు డీఫాల్ట్‌ బెయిల్‌ ఇవ్వాలంటూ మరో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ వ్యాజ్యాలపై శుక్రవారం జస్టిస్‌ రవి విచారణ జరిపారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కలిగినీడి చిదంబరం వాదనలు వినిపిస్తూ, పిటిషనర్‌ స్వయంగా చెప్పిన వివరాలు తప్ప హత్య విషయంలో ఎలాంటి ఆధారాలు లేవన్నారు. పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌లో లోపాలున్నాయన్న కారణంతో కింది కోర్టు దానిని తిరస్కరించిందన్నారు. బెయిల్‌ మంజూరు చేస్తూ ఎలాంటి షరతులు విధించినా అభ్యంతరం లేదన్నారు.  మరోవైపు.. ఈ వ్యాజ్యాల్లో మృతుడు తల్లి నూకరత్నం ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆమె తరఫున సీనియర్‌ న్యాయవాది, టీడీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ, అనంతబాబుకు  నేరచరిత్ర ఉందని.. ఆయనపై పోలీసులు రౌడీషీట్‌ కూడా తెరిచారని తెలిపారు. దీంతో న్యాయమూర్తి, పిటిషనర్‌పై ఉన్న కేసులు, అతనిపై దాఖలు చేసిన చార్జిషీట్‌ వివరాలతో పాటు మృతుడు సుబ్రహ్మణ్యం పోస్టుమార్టం నివేదికను తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించారు. 

లొంగిపోయిన అనంతబాబు 
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): తాత్కాలిక బెయిల్‌ గడువు ముగియడంతో ఎమ్మెల్సీ అనంతబాబు శుక్రవారం రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో లొంగిపోయారు. గత నెలలో అనంతబాబు తల్లి చనిపోవడంతో కోర్టు ఆయనకు ఈ నెల 9 వరకు బెయిల్‌ ఇచ్చింది. గడువు ముగియడంతో ఆయన జైలు అధికారుల ముందు హాజరయ్యారు.

ఇదీ చదవండి: ఐవోబీ మాజీ ఉద్యోగులకు ఐదేళ్ల జైలు

మరిన్ని వార్తలు