ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో మరొకరు అరెస్ట్‌

8 Mar, 2023 20:12 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ స్కామ్ కేసులో మరో అరెస్టు జరిగింది. సిమెన్స్ మాజీ ఉద్యోగి జీవీఎస్ భాస్కర్‌ను  సీఐడి అదుపులోకి తీసుకుంది. నోయిడాలో అతడ్ని అరెస్టు చేసింది. ఈయనను ట్రాన్సిట్‌ వారంట్‌పై విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టనుంది.

సిమెన్స్ సంస్థ రూపొందించిన స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ ప్రాజెక్టు ధరను కృత్రిమంగా పెంచడంలో భాస్కర్ కీలక పాత్ర పోషించాడు.  ప్రోగ్రామ్ అసలు ధర రూ.58కోట్లు ఉంటే దానిని రూ.3,300కోట్లుగా ప్రభుత్వానికి చూపెట్టాడు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలోని పెద్దల సహాయంతో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌ ప్రాజెక్టులో మోసాలకు పాల్పడ్డాడు.

రూ.3,300కోట్లను ప్రాజెక్టు ధరగా నిర్ణయించి ప్రభుత్వ వాటా కింద రూ.371కోట్లు కొట్టేసిన ఘనులు. సిమెన్స్ సంస్థతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఎంవోయూలోని అంశాలను సైతం భాస్కర్ అండ్‌ కో పూర్తిగా మార్చేసింది. రూ.3,300కోట్ల ప్రాజెక్టులో ప్రభుత్వ వాటా కింద 371కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. ప్రైవేటు సంస్థలు మిగిలన వ్యయం భరించాలి. ప్రైవేటు వాటా డబ్బుకు సంబంధించి ఎంవోయూలో ఎలాంటి ప్రస్తావన లేకుండా.. కేవలం ప్రభుత్వం వాటా రూ.371కోట్ల వర్క్ ఆర్డర్‌ రిలీజ్ చేసే విధంగా భాస్కర్‌ ఎంవోయూను మార్చేశాడు. 

యూపీ క్యాడర్ ఐఏఎస్ అయిన తన భార్య అపర్ణను స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌ డిప్యూటీ సీఈఓగా నియమించుకునేందుకు అప్పటి సీఈఓ సుబ్బారావుతో లాలూచీ పడ్డారు. తన భార్యను డిప్యూటీ సీఈఓగా నియమించుకునే సమయంలో తమకు ఈప్రాజెక్టుతో సంబంధం ఉందని భాస్కర్‌ దంపతులు ఎక్కడా ప్రకటించలేదు. ప్రభుత్వ నిధులు విడుదలయ్యేందుకు ప్రాజెక్టు విలువను థర్డ్‌ పార్టీ ద్వారా నిర్ధారించుకునేందుకు సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్స్ డిజైన్ ద్వారా ప్రాజెక్టును స్టడీ చేయించారు. ఈ సంస్థ అధికారులను ప్రభావితం చేయడం ద్వారా ప్రాజెక్టు విలువను పెంచుకున్నారు.  నిధులను దారి మళ్లించేందుకు భాస్కర్ ఆప్టస్ హెల్త్‌ కేర్ అనే డొల్ల కంపెనీని ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు.
చదవండి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌  స్కాంలో కీలక మలుపు.. చంద్రబాబు అవినీతికోట బద్దలు!

మరిన్ని వార్తలు