Apsara Murder Case: పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఏముందంటే?

10 Jun, 2023 13:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తన కూతురు అలాంటి అమ్మాయి కాదని.. చాలా కిరాతకంగా చంపాడంటూ కాశీ నుంచి ఇంటికి చేరుకున్న అప్సర తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ‘సాక్షి’ మీడియాతో మాట్లాడుతూ.. తమకు, సాయికృష్ణ కుటుంబానికి ఎటువంటి రిలేషన్ లేదని, ఇలా అవుతుందనుకోలేదన్నారు. తెలిసిన వెంటనే ఫ్లైట్ ఎక్కి ఇక్కడికి వచ్చానన్నారు. పూజారి అయి ఉండి ఇలా చేశాడని, నిందితుడికి  కఠిన శిక్ష పడాలని అప్సర తల్లిదండ్రులు కోరారు.

కాగా, ఉస్మానియా మార్చురీలో అప్సర మృతదేహానికి పోస్ట్‌మార్టం చేసిన వైద్యులు.. ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. తలకు బలమైన గాయాలు కావడంతోనే అప్సర మృతి చెందినట్లు అప్సర ప్రిలిమినరీ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలింది.

జరిగింది ఇదే..
గుడికి వచ్చిన అప్సరతో వివాహితుడైన పూజారికి ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్నాళ్లు బాగానే గడిపారు. తీరా తనను వివాహం చేసుకోవాల్సిందిగా ఆమె నుంచి ఒత్తిడి పెరగడంతో చంపాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం నగర శివార్లలోకి తీసుకువెళ్లి దారుణంగా హతమార్చాడు.
చదవండి: అప్సర కేసు: సాయికృష్ణ అమాయకుడా?

మృతదేహాన్ని సరూర్‌నగర్‌ మండల ఆఫీసు వెనుక ఉన్న పాత సెప్టిక్‌ ట్యాంక్‌లో పడేసి ఉప్పు, ఎర్రమట్టి నింపాడు. వాసన బయటకు రాకుండా దానికి ఉన్న రెండు మ్యాన్‌హోల్స్‌కు కాంక్రీట్‌ చేశాడు. తర్వాత ఆమె అదృశ్యమైనట్లు ఆర్‌జీఐఏ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సాంకేతిక ఆధారాలతో ముందుకు వెళ్లిన పోలీసులు ఆమె హత్యకు గురైనట్లు తేల్చారు. 

అప్సరను దారుణంగా హతమార్చిన నిందితుడు, పూజారి సాయికృష్ణను పోలీసులు, శుక్రవారం అర్ధరాత్రి జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఐపీసీ సెక్షన్‌ 201, 302 ప్రకారం అతనిపై కేసు నమోదు చేశారు. దీంతో నిందితుడికి 14 రోజుల రిమాండ్‌ విధించగా.. చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు.

 

మరిన్ని వార్తలు