గుంతకల్లులో విషాదం: డాక్టర్‌ ఆత్మహత్య

13 Sep, 2021 07:51 IST|Sakshi
కార్తీక్‌వర్ధన్‌ (ఫైల్‌)

గుంతకల్లు టౌన్‌(అనంతపురం జిల్లా): ఆర్మీ డాక్టర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఒంటరితనం భరించలేక ఆయన అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గుంతకల్లులో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... పట్టణంలోని భాగ్యనగర్‌ గంట చర్చి ఏరియాకు చెందిన వెంకటస్వామి, నాగమణి దంపతుల కుమారుడు కార్తీక్‌ వర్ధన్‌ (33)కర్నూలు మెడికల్‌ కాలేజీలో 2011లో ఎంబీబీఎస్‌ పూర్తిచేశాడు. తదనంతరం ఆగ్రా మిలటరీ హాస్పిటల్‌లో వైద్యుడిగా ఉద్యోగం పొందాడు. తనతో పాటు ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన ఆదోనికి చెందిన డాక్టర్‌ అప్పియాను ప్రేమించి నాలుగేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. (చదవండి: భర్త, పిల్లలను వదిలేసి 9 ఏళ్లుగా డేటింగ్‌.. కానీ ప్రియుడేమో?)  

ఈమె ప్రస్తుతం పుణేలోని నేవీలో మెడికల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగరీత్యా కార్తీక్‌వర్ధన్, అప్పియా ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతంలో ఉన్నారు. వారం రోజుల క్రితం గుంతకల్లుకు వచ్చిన కార్తీక్‌ వర్ధన్‌ శనివారం రాత్రి వరకు తన కుటుంబ సభ్యులు, బంధువులతో సరదాగా గడిపాడు. కాగా తానొకచోట, భార్య, తల్లిదండ్రులు మరోచోట ఉండటంతో మనస్తాపానికి గురైన కార్తీక్‌వర్దన్‌ ఆదివారం ఉదయం ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వన్‌టౌన్‌ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ పద్మావతి తెలిపారు.

చదవండి:
టీడీపీలో ముసలం: తారస్థాయికి వర్గ విభేదాలు  

మరిన్ని వార్తలు