ఆర్మీ జవాన్‌ ఆత్మహత్య

9 Mar, 2021 08:04 IST|Sakshi
ఆర్మీ జవాన్‌ రజనీకుమార్(ఫైల్‌ ఫొటో)‌

నాన్నా బాగానే ఉన్నా అంటూ ఫోన్‌కాల్‌‌ 

తెల్లారేసరికి మరణవార్త

అమరచింత/ వనపర్తి: దేశ రక్షణలో తానూ భాగస్వామిని అవుతానని తరచూ చెబుతూ ఆర్మీలో ఎంపిక కోసం అహర్నిశలు కష్టపడ్డాడు ఆ యువకుడు. చివరకు అనుకున్నది సాధించి ఆర్మీలో చేరిన రెండేళ్లకే విధుల్లో ఉంటూనే తనువు చాలించాడు. వనపర్తి జిల్లా అమరచింతకి చెందిన మాసమ్మ, గొల్లబాబు దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు రజనీకుమార్‌ (21) ఆర్మీలో చేరేందుకు శిక్షణ తీసుకుని రెండేళ్ల క్రితం ఎంపికయ్యాడు. అప్పటి నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌లో బోర్డర్‌ సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల తాత కావలి సత్యన్న మృతి చెందాడన్న సమాచారం అందగా అంత్యక్రియలకు రాలేకపోయాడు.

అయితే దశదినకర్మకు ఎలాగోలా హాజరయ్యాడు. రెండు నెలల పాటు సెలవు తీసుకుని కుటుంబసభ్యులతో గడిపి తిరిగి జనవరి 29న విధుల్లో చేరాడు. తల్లిదండ్రులతో తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి తండ్రితో ఫోన్‌లో ‘నాన్నా.. నేను బాగానే ఉన్నా, మీరు ఎలా ఉన్నారు.. ’అని యోగక్షేమాలు తెలుసుకున్నాడు. ఇక్కడంతా బాగానే ఉందని చెబుతూనే.. రాత్రి బిర్యానీ తినడం వల్ల కడుపునొప్పి వస్తుందని చెప్పాడు.

ఆస్పత్రికి వెళ్లి చూయించుకో అని తండ్రి సలహా ఇచ్చినా.. అదే తగ్గిపోతుందిలే అని బదులిచ్చాడు. బోర్డర్‌లో కాపలా కాసేందుకు సోమవారం నుంచి వేరేచోట విధుల్లోకి వెళ్తున్నానని చెప్పాడు. అయితే అక్కడి స్టోర్‌రూంలో ఆదివారం అర్ధరాత్రి దాటాక ఉరివేసుకుని చనిపోయాడని.. తల్లిదండ్రులకు మిలిటరీ క్యాంపు కార్యాలయం నుంచి సోమవారం ఉదయం సమాచారం అందింది. తన కుమారుడు ఆత్మహత్య చేసుకునేవాడు కాదని, ఏదో అనుమానాస్పదంగా మృతి చెంది ఉంటాడని వారు పేర్కొంటున్నారు.

చదవండి: పుట్టిన రోజే మృత్యు ఒడికి..! 

మరిన్ని వార్తలు