సైబర్‌ మోసగాళ్ల అరెస్ట్‌ 

13 Jan, 2022 04:29 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మన్‌గో గోనట్స్‌ వ్యాపారం పేరుతో రూ.78 లక్షల మోసం

విజయవాడ స్పోర్ట్స్‌: మన్‌గో గోనట్స్‌ వ్యాపారం చేస్తే అధిక లాభాలు వస్తాయని వ్యాపారులను నమ్మించి నగదు వసూలు చేస్తూ భారీ సైబర్‌ మోసానికి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాకు విజయవాడ సైబర్‌ పోలీసులు చెక్‌ పెట్టారు. గుజరాత్‌ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌ కేంద్రంగా ఈ నేరానికి పాల్పడుతున్న సతీష్‌శర్మ, కృష్ణశర్మను అరెస్టు చేశారు. నిందితులు ఇద్దరూ విజయవాడ హనుమాన్‌పేటకు చెందిన ఓ చెప్పుల వ్యాపారిని ఉచ్చులోకి దింపారు.

ముందుగా ఫేస్‌బుక్‌ ద్వారా ఓ మహిళను ఆ వ్యాపారికి పరిచయం చేసి మన్‌గో గోనట్స్‌ వ్యాపారాన్ని వివరించారు. ఆఫ్రికా దేశాల్లో తక్కువ ధరకు లభించే ఈ నట్స్‌ను ఇండియాలో అమ్మితే లాభాలు గడించవచ్చని వ్యాపారిని నమ్మించారు. పలు దఫాలుగా రూ.78 లక్షలు వసూలు చేశారు. తరువాత నుంచి ఫోన్‌లు స్విచ్ఛాఫ్‌ చేశారు. దీంతో చెప్పుల వ్యాపారి సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులు గుజరాత్‌ కేంద్రంగా సైబర్‌ నేరానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు.

అక్కడి పోలీసుల సహకారంతో ముందుగా నిందితులు సతీష్‌శర్మ, కృష్ణశర్మకు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులకు వారు స్పందించకపోవడంతో వారిద్దరినీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు సైబర్‌ సీఐ కె.శ్రీనివాస్‌ తెలిపారు. నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించడంతో రాజమండ్రి జైలుకు పంపినట్లు చెప్పారు. 

మరిన్ని వార్తలు