నకిలీ ఈడీ అధికారుల అరెస్ట్‌

29 Aug, 2022 04:50 IST|Sakshi
నిందితుల వివరాలను వెల్లడిస్తున్న ఏఎస్పీ

బంగారం షాపులో దోపిడీకి ప్రణాళిక

గ్యాంగ్‌లీడర్‌ పాత నేరస్తుడే

ఎయిర్‌ పిస్టల్, పెల్లెట్స్, రెండు ఇన్నోవా కార్లు స్వాధీనం

నెల్లూరు జిల్లాలో ఘటన

నెల్లూరు (క్రైమ్‌) (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా): ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారుల వేషంలో బంగారు దుకాణంలో దోపిడీకి యత్నించిన ఏడుగురు నిందితులను నెల్లూరు సంతపేట పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి ఎయిర్‌ పిస్టల్, పెల్లెట్స్, రెండు ఇన్నోవా కార్లు, తొమ్మిది సెల్‌ఫోన్లు, నకిలీ ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం నెల్లూరు డీఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ (క్రైమ్స్‌) కె.చౌడేశ్వరి ఈ వివరాలను వెల్లడించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణాపురానికి చెందిన ఆరవీటి రమేష్‌ వ్యాపార రీత్యా హైదరాబాద్‌లోని మియాపూర్‌లో స్థిరపడ్డాడు.

వివిధ వ్యాపారాలు చేసి అప్పుల పాలయ్యాడు. హైదరాబాద్‌లోని ఓ ఫైనాన్స్‌ కంపెనీలో పనిచేస్తూ యజమానిని రూ.కోటి వరకు మోసగించాడు. అదే కంపెనీలో పనిచేస్తున్న ముషీరాబాద్‌కు చెందిన కౌశల్‌రావును తన పీఏగా పెట్టుకున్నాడు. కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు రమేష్‌పై చీటింగ్‌ కేసు నమోదు చేశారు. తన బావ హత్య కేసులో రమేష్‌ను 2018లో కర్నూలు జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు.

రమేష్‌కు దొంగనోట్ల కేసులో అదే జైలులో ఉన్న శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లికి చెందిన యోగానంద్‌గౌడ్‌ అలియాస్‌ యోగితో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి విడుదలయ్యాక రమేష్‌ తిరిగి హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడ హోల్‌సేల్‌ వ్యాపారుల వద్ద బంగారు ఆభరణాలు కొని కందుకూరు, పొదిలి తదితర ప్రాంతాల్లోని వ్యాపారులకు కమీషన్‌ పద్ధతిపై సరఫరా చేసేవాడు. 

పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించాలని..
వ్యాపారం చేస్తున్నా ఆశించిన స్థాయిలో డబ్బులు రాకపోవడంతో ఎలాగైనా పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించాలని రమేష్‌ నిర్ణయించుకున్నాడు. ఈడీ అధికారులు ఎక్కడైనా దాడులు చేయొచ్చు.. ఏదైనా సీజ్‌ చేయొచ్చని పత్రికల్లో వచ్చిన కథనాలను చదివాడు. నకిలీ ఈడీ అధికారి అవతారమెత్తి బంగారు ఆభరణాలు కాజేయాలని నిర్ణయించుకున్నాడు.

ఈ విషయాన్ని యోగానంద్‌గౌడ్‌కు, పీఏ కౌశల్‌రావుకు తెలియజేశాడు. యోగానంద్‌గౌడ్‌ ద్వారా కర్నూలు జిల్లాకు చెందిన మద్దిలేటి గౌడ్, నంద్యాల జిల్లాకు చెందిన జి.బాలకృష్ణ, మామిళ్లపల్లికి చెందిన జి.బాబును కలిశాడు. ఈ ఆరుగురు గ్యాంగ్‌గా ఏర్పడ్డారు. 

పక్కాగా రెక్కీ నిర్వహించి..
ఈ క్రమంలో ఎక్కువ బంగారం ఏ దుకాణంలో ఉంటుందో గ్యాంగ్‌ రెక్కీ నిర్వహించింది. నెల్లూరులోని లావణ్య జ్యుయెలరీ షాప్‌ను తమ దోపిడీకి ఎంచుకుంది. చెన్నెలో నకిలీ ఐడీ కార్డులు, పోలీస్‌ యూనిఫామ్‌ తయారు చేయించారు. అక్కడే ఎయిర్‌ పిస్టల్, పిల్లెట్స్‌ కొనుగోలు చేసి నెల్లూరు వచ్చారు. ఈ నెల 26న లావణ్య జ్యుయెలరీలో ఈడీ అధికారుల మాదిరిగా తనిఖీలకు వెళ్లినట్టు గ్యాంగ్‌ వెళ్లింది.

సహజంగా తనిఖీకు వెళ్లిన ఏ అధికారులైన బంగారాన్ని సీజ్‌ చేసిన వెంటనే ఫొటోలు తీసి కేసు నమోదు చేస్తారు. అనంతరం బంగారాన్ని అక్కడే వదిలివెళ్తారు. అయితే నిందితులు కిలో బంగారాన్ని బ్యాగ్‌లో సర్దుకుని వెళ్లిపోతుండటంతో అనుమానమొచ్చిన షాప్‌ యజమాని పోలీసులకు సమాచారం అందించారు.

సంతపేట ఇన్‌స్పెక్టర్‌ షేక్‌ అన్వర్‌బాషా నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించి విచారించారు. అనంతరం ఆరుగురు నిందితులను, కారు డ్రైవర్‌ నెల్లూరుకి చెందిన వెంకటకృష్ణను ఆదివారం అరెస్ట్‌ చేశారు. నిందితులను అరెస్ట్‌ చేసిన సిబ్బందిని ఎస్పీ విజయారావు అభినందించారు.  

మరిన్ని వార్తలు