డ్రగ్స్‌ కేసులో కీలక నిందితుడు అరెస్ట్‌

21 Feb, 2022 04:43 IST|Sakshi
నిందితుడు సోనుతో ఎస్‌ఈబీ అధికారులు

ఎస్‌ఈబీ సూపరింటెండెంట్‌ అవులయ్య వెల్లడి

ఒంగోలు: రెండు లక్షల రూపాయల విలువైన డ్రగ్స్‌ తరలిస్తున్న కేసులో కీలక నిందితుడు మలిపెద్ది సాయిరాఘవ అలియాస్‌ సోనును అరెస్టు చేసినట్టు ఎస్‌ఈబీ సూపరింటెండెంట్‌ అవులయ్య తెలిపారు. ఒంగోలు ఎస్‌ఈబీ కార్యాలయంలో ఆదివారం నిందితుడిని మీడియా ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌ఈబీ జాయింట్‌ డైరెక్టర్‌ గరికపాటి బిందుమాధవ్‌ నుంచి వచ్చిన సమాచారం మేరకు తమ సిబ్బంది ఈ నెల 18న స్థానిక రైల్వే స్టేషన్‌ సమీపంలో గుజ్జు విజయశివభార్గవరెడ్డిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ.2 లక్షల విలువైన నిషేధిత డ్రగ్స్‌ను సీజ్‌ చేసినట్టు తెలిపారు.

అతనిని విచారించగా ఈ కేసులో బెంగళూరుకు చెందిన ఆంటోనీ, వైజాగ్‌కు చెందిన సోనులు కీలక పాత్రధారులుగా గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలో తమ సిబ్బంది వైజాగ్‌ వెళ్లి మలిపెద్ది సాయిరాఘవ అలియాస్‌ సోనును అరెస్టు చేసి విచారించగా.. 2019లో వైజాగ్‌లో సంచలనం సృష్టించిన రేవ్‌ పార్టీ గంజాయి కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడుగా తేలిందన్నారు. సోనును రిమాండ్‌కు తరలించినట్టు అవులయ్య వివరించారు. కార్యక్రమంలో ఎస్‌ఈబీ అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ సూపరింటెండెంట్‌ శ్రీధర్‌బాబు, ఒంగోలు ఎస్‌ఈబీ ఇన్‌స్పెక్టర్‌ లత తదితరులున్నారు.  

మరిన్ని వార్తలు