‘కొండగట్టు’ దొంగల అరెస్ట్‌

9 Mar, 2023 01:49 IST|Sakshi

మల్యాల(చొప్పదండి): జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయ వసతి గృహాల్లో మంగళవారం ఉదయం చోరీకి పాల్పడిన దొంగలను పోలీసులు 24 గంటల్లోనే అరెస్ట్‌ చేశారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రమణమూర్తి, ఎస్సై చిరంజీవితో కలిసి డీఎస్పీ ప్రకాశ్‌ వివరాలు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన దూలం శశాంక్, తోకల నితిన్, ఎనగందుల పవన్‌చందు, మరో ఇద్దరు మైనర్లు జల్సాలకు అలవాటు పడ్డారు.

హోలీ సందర్భంగా కొండగట్టులో దొంగతనం చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఓ కారును అద్దెకు తీసుకుని అంజన్న సన్నిధికి చేరారు. మంగళవారం ఉదయం ఏడు గంటల సమయంలో భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్లగా.. మారుతీ నిలయంలోని 11, 16 నంబర్ల గదుల తాళాలు పగులగొట్టారు. భక్తుడు సంధానవేని సంతోష్కు చెందిన సెల్‌ఫోన్, అసోంకు చెందిన సంజీత్‌దాస్‌కు చెందిన మరో మొబైల్‌ ఫోన్, గోదావరిఖనికి చెందిన గుగులోత్‌ రమేశ్‌కు చెందిన మరో ఫోన్‌తోపాటు రూ.నాలుగు వేల నగదు అపహరించారు.

దీంతో సీఐ రమణమూర్తి ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక పోలీసు బృందాలను నియమించారు. దొంగలమర్రి చెక్‌పోస్టు వద్ద సీఐ, ఎస్సై ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేస్తుండగా ఈ ఐదుగురు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని పట్టుకొని విచారించగా చోరీ చేసింది వారేనని తేలింది. దీంతో వారిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. 24 గంటల్లోనే దొంగలను పట్టుకున్న సీఐ రమణమూర్తి, ఎస్సై చిరంజీవిని డీఎస్పీ ప్రకాశ్‌ అభినందించారు. 
 

మరిన్ని వార్తలు