రెమ్‌డెసివిర్‌ విక్రయ ముఠాల అరెస్టు

2 May, 2021 05:19 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న రూరల్‌ ఏఎస్పీ మూర్తి

తెనాలి రూరల్‌/నరసరావు పేట రూరల్‌/మంగళగిరి: కరోనా చికిత్స కోసం ఉపయోగించే రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న మూడు ముఠాలను గుంటూరు రూరల్‌ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నరసరావుపేట, తెనాలి, గుంటూరు పోలీసులు మొత్తం 11మంది నిందితులను శనివారం అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులోని రూరల్‌ ఎస్పీ కార్యాలయంలో విలేకరులకు అదనపు ఎస్పీ(క్రైమ్స్‌) ఎన్‌వీఎస్‌ మూర్తి వివరాలు వెల్లడించారు. రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ ఆదేశాల మేరకు తెనాలి, నరసరావుపేట, గుంటూరు పోలీసులు డెకాయ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు.

నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన డెకాయ్‌ ఆపరేషన్‌లో.. ఒక్కో ఇంజక్షన్‌ రూ.40 వేల చొప్పున విక్రయిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకోగా, మరో నిందితుడు, 108లో పనిచేసే శివ పరారీలో ఉన్నాడు. అలాగే తెనాలి డీఎస్పీ డాక్టర్‌ కె.స్రవంతిరాయ్‌ నేతృత్వంలో నిర్వహించిన డెకాయ్‌లో ఆరు ఇంజక్షన్లను రూ.2.40 లక్షలకు విక్రయిస్తూ ఆరుగురు నిందితులు పట్టుబడ్డారు. అదేవిధంగా గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలోని మెడికల్‌ షాపులో పనిచేస్తున్న ఓ యువకుడు, స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట మెడికల్‌ షాపు నడుపుతున్న మరోవ్యక్తితో కలిసి బ్లాక్‌లో రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను విక్రయిస్తున్నాడు. గుంటూరు పోలీసులు ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.    

మరిన్ని వార్తలు