సర్పంచ్‌గా గెలవడం తట్టుకోలేక ప్రత్యర్థి వర్గం ఘాతుకం

7 Aug, 2021 11:34 IST|Sakshi

పాత కక్షలతోనే  సర్పంచ్‌ హత్య 

లింగాల : వైఎస్సార్‌ కడప జిల్లా లింగాల మండలం కోమన్నూతల సర్పంచ్‌ కణం చిన్న మునెప్ప హత్యకు పాత కక్షలే కారణమని డీఎస్పీ శ్రీనివాసులు పేర్కొన్నారు. లింగాల పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. మునెప్ప సర్పంచ్‌గా గెలుపొందడం జీర్ణించుకోలేక నాగిరెడ్డి గారి లక్ష్మీరెడ్డి వర్గీయులు హతమార్చారు. 1995లో గ్రామంలోని సరిబాల లక్ష్మీనారాయణరెడ్డి వర్గీయులు అదే గ్రామానికి చెందిన కాల్వ పుల్లన్నపై బాంబులు, తుపాకులు, కొడవళ్లతో దాడిచేసి చంపారు. దాడిలో పుల్లన్న, నలుగురు సోదరులు తీవ్రంగా గాయపడ్డారు.


ఈ కేసులో కణం చిన్న మునెప్ప నిందితుడిగా ఉన్నాడు. తర్వాత 1995లో పులివెందుల మండలం రాయలాపురం బ్రిడ్జి సమీపంలో సరిబాల లక్ష్మీనారాయణరెడ్డి వర్గీయులే నాగిరెడ్డి గారి లక్ష్మీరెడ్డి బావ అంకిరెడ్డి మనోహర్‌రెడ్డిని హతమార్చారు. ఈ కేసులో కణం చిన్న మునెప్ప హస్తం ఉన్నట్లు బయటపడింది. అప్పటి నుంచి ఇతడిపై లక్ష్మీరెడ్డి వర్గీయులు కక్ష పెంచుకున్నారు. చిన్న మునెప్పను హతమార్చేందుకు పథకం వేశారు. గతనెల 27వ తేదీన పులివెందులలో నిర్వహించిన సర్పంచ్‌ శిక్షణా తరగతులకు కణం చిన్నమునెప్ప హాజరై తిరిగి వస్తున్నాడు.

ఈ క్రమంలో నాగిరెడ్డిగారి లక్ష్మీరెడ్డి, మరో 15 మంది ద్విచక్ర వాహనాల్లో వచ్చి ఢీకొట్టారు. కిందపడిన చిన్న మునెప్పను కొడవళ్లతో అతి కిరాతకంగా నరికి చంపారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను గురువారం వెలిదండ్ల సమీపంలోని గొడ్డుమర్రి క్రాస్‌ రోడ్డు వద్ద అరెస్టు చేశారు. ప్రత్యక్ష సాక్షి సరిబాల వెంకట్రామిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ద్విచక్రవాహలను సీజ్‌ చేసినట్లు చెప్పారు. నిందితులను శుక్రవారం పులివెందుల సివిల్‌ జడ్జి కోర్టుకు హాజరుపరచగా.. రిమాండ్‌కు పంపించారు. సమావేశంలో సీఐ రవీంద్రనాథరెడ్డి, ఎస్‌ఐ హృషికేశవరెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు