పోలీస్‌ కస్టడీకి ఆశిష్‌

12 Oct, 2021 04:38 IST|Sakshi
లక్నోలో మౌన దీక్ష చేస్తున్న ప్రియాంకా గాంధీ

లఖీమ్‌పూర్‌ఖేరి/బహ్రెయిచ్‌: లఖీమ్‌పూర్‌ ఖేరి హింసాత్మక ఘటనల కేసులో కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌కు కోర్టు మూడు రోజుల పోలీస్‌ కస్టడీ విధించింది. ఈనెల 3వ తేదీన జరిగిన ఘటనల్లో నలుగురు రైతులు సహా మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆశిష్‌ మిశ్రాను పోలీసులు 14 రోజుల రిమాండ్‌ కోరగా.. 12 నుంచి 15వ తేదీ వరకు అంటే మూడు రోజులపాటు పోలీస్‌ కస్టడీకి కోర్టు అనుమతించిందని అధికారులు తెలిపారు. 15వ తేదీ ఉదయంతో రిమాండ్‌ గడువు ముగియనుంది. ఈ సమయంలో ఆశిష్‌ మిశ్రాను ఇబ్బందిపెట్టరాదనీ, విచారణ సమయంలో లాయర్‌ ఆయన పక్కనే ఉంటారని చీఫ్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ చింతారాం షరతు విధించారు. అంతకుముందు, ఓ కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది.  

టింకోనియాలో నేడు అంతిమ్‌ అర్థాస్‌
లఖీమ్‌పూర్‌ ఖేరిలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతులకు మంగళవారం అంతిమ్‌ అర్థాస్‌ (అంతిమ ప్రార్థన) జరుపుతామని సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం) తెలిపింది. అసువులు బాసిన రైతులకు నివాళులర్పించేందుకు మంగళవారం షహీద్‌ కిసాన్‌ దివస్‌గా పాటించాలని ఎస్‌కేఎం  పిలుపునిచ్చింది. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో దేశవ్యాప్తంగా రైతులు తమ నివాసాల వెలుపల కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించాలని కోరింది. హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న టికోనియా గ్రామంలో జరిగే అంతిమ ప్రార్థన  కార్యక్రమానికి రాకేశ్‌ తికాయత్‌ సహా రైతు నేతలు తరలిరానున్నారు. ఇలా ఉండగా, లఖీమ్‌పూర్‌ఖేరి బాధిత రైతు కుటుంబాలకు న్యాయం జరగాలంటూ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ సోమవారం లక్నోలో జీపీవో పార్కు వద్ద ఉన్న గాంధీజీ విగ్రహం వద్ద మౌనదీక్ష చేపట్టారు.
 

>
మరిన్ని వార్తలు