రైతుబంధు సమితి కన్వీనర్‌పై హత్యాయత్నం

1 Oct, 2020 08:25 IST|Sakshi
నిందితులు ఉపయోగించిన బొమ్మ తుపాకీ

కాల్వశ్రీరాంపూర్‌(పెద్దపల్లి): రైతుబంధు సమితి కాల్వ శ్రీరాంపూర్‌ మండల కన్వీనర్‌ నిదానపురం దేవయ్యపై మంగళవారం అర్ధరాత్రి హత్యాయత్నం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కాల్వశ్రీరాంపూర్‌ మండల కేంద్రంలోని తన ఇంట్లో దేవయ్య నిద్రిస్తున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు  ముసుగులు ధరించి, తలపులు తట్టారు. అన్న పిలుస్తున్నాడంటూ ఆయనను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లారు. జమ్మికుంటకు వెళ్లే రహదారి పక్కన దేవయ్యను కొట్టి, గాయపరిచారు. అనంతరం తుపాకీతో కాల్చేందుకు ప్రయత్నించగా ఆయన దాన్ని లాక్కొని, సమీపంలోని పొలాల్లోకి విసిరేశాడు. దేవయ్య కూతురు అరవడంతో దుండగులు పారిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఆర్‌అండ్‌బీ రహదారి పక్కన నూతనంగా ఇల్లు నిర్మించుకుంటున్నానని తెలిపారు. గ్రామానికి చెందిన కనకేశ్‌ అనే వ్యక్తితో భూ తగాదా ఉందని, అతనికి దారి ఎందుకు ఇవ్వడం లేదని కొందరు తనను తుపాకీతో కాల్చేందుకు ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కూతురు సౌమ్య అరవడంతో చుట్టపక్కల వారు నిద్రలేచారని, ఇంతలో వారు పారిపోయారని పేర్కొన్నారు.

మండలంలో చర్చనీయాంశమైన ఘటన
నిందితులు దేవయ్యను కాలుస్తామని బెదిరించింది బొయ్య తుపాకీతోనని పోలీసులు తెలిపారు. నిజమైనదే అయితే దేవయ్య ప్రాణాలు పోయేవని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఆయనపై దాడి మండలంలో చర్చనీయాంశంగా మారింది. బాధితుడి ఫి ర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేశామని కాల్వ శ్రీరాంపూర్‌ ఎస్సై వెంకటేశ్వర్‌ తెలిపారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని, విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు