డిప్యూటీ తహసీల్దార్‌పై టీడీపీ నేతల హత్యాయత్నం 

19 May, 2022 05:15 IST|Sakshi

రేషన్‌ షాపు తనిఖీ చేస్తున్నందుకు ఆగ్రహం  

దాడిలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌  

కృష్ణా జిల్లా పెనమలూరులో ఘటన 

పెనమలూరు: కృష్ణా జిల్లా పెనమలూరులో రేషన్‌ షాపును తనిఖీ చేయడానికి వెళ్లిన డిప్యూటీ తహసీల్దారుపై మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బోడే ప్రసాద్, ఆయన అనుచరులు హత్యాయత్నానికి ఒడిగట్టారు. అక్కడే ఉన్న వీఆర్వోపైనా దాడి చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పెనమలూరులో డీలర్‌ లుక్కా అరుణ్‌బాబు నిర్వహిస్తున్న రేషన్‌ దుకాణం (నం.27)లో స్టాకు తనిఖీకి డిప్యూటీ తహసీల్దార్‌ (పీడీఎస్‌) గుమ్మడి విజయ్‌కుమార్, వీఆర్వో మంగరాజు మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో వెళ్లారు.

తనిఖీల్లో 330 కిలోల బియ్యం, 152 ప్యాకెట్ల పంచదార తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఈ అధికారులు డీలర్‌ స్టేట్‌మెంట్‌ తీసుకుని రిపోర్టు రాస్తున్న సమయంలో బోడే ప్రసాద్‌ రాత్రి 10 గంటలకు రేషన్‌షాపు వద్దకు వచ్చి.. తన వెంట వచ్చిన అనుచరులతో అధికారులపై దాడి చేయించారు. వారు డిప్యూటీ తహసీల్దార్‌ గొంతు నులిమి చంపే యత్నం చేశారు. రిపోర్టును బలవంతంగా తీసుకెళ్లారు. ఈ ఘటనలో డిప్యూటీ తహసీల్దార్‌ కంటికి తీవ్ర గాయమైంది. ఆయనకు కంటికి వైద్యం కోసం ఎల్‌వీ ప్రసాద్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో వీఆర్వో మంగరాజుకు స్వల్ప గాయాలయ్యాయి.  

పరారీలో బోడే ప్రసాద్‌.. 
దాడి తర్వాత బోడే ప్రసాద్‌ పరారీలో ఉన్నట్టు పెనమలూరు సీఐ ఎం.సత్యనారాయణ తెలిపారు. దాడిలో పాల్గొన్న వారిపై ఐపీసీ 353, 332, 323, 506, 392, 307 రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. ఎ1గా బోడే ప్రసాద్, ఎ2గా వంగూరు పవన్, ఎ3గా కంఠమనేని పార్థు, ఎ4గా దొంతగాని పుల్లేశ్వరరావు, ఎ5గా కొల్లిపర ప్రమోద్‌కుమార్, ఎ6గా కిలారు ప్రవీణ్‌కుమార్, ఎ7గా బోడె మనోజ్, ఎ8గా కాపరౌతు వాసు, ఎ9గా కిలారు కిరణ్‌కుమార్, ఎ10గా చిగురుపాటి శ్రీనివాసరావులతో పాటు మరికొందరు ఉన్నారని చెప్పారు. వీరిలో ఎ1, ఎ3 మినహా మిగతా వారిని బుధవారం అరెస్టు చేశామని, ప్రధాన నిందితుడు బోడే ప్రసాద్‌ కోసం గాలిస్తున్నామని సీఐ తెలిపారు.  

రేషన్‌ షాపు సీజ్‌ చేశాం 
ప్రతి నెలా అన్ని రేషన్‌ షాపుల్లో స్టాకు తనిఖీలు చేస్తాం. ఇందులో భాగంగానే పెనమలూరులో రేషన్‌షాపును తనిఖీ చేసి రిపోర్టు రాస్తుండగా దాడి చేశారు. ఈ ఘటనతో రేషన్‌షాపు సీజ్‌ చేశాం. తనిఖీకి వచ్చిన అధికారులపై దాడి చేయటం దారుణం. పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. డీలర్‌ను సస్పెండ్‌ చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపాం.  
    – జి.భద్రు, తహసీల్దార్, పెనమలూరు 

మరిన్ని వార్తలు