ఎమ్మెల్సీ అనంతబాబుపై హత్య కేసు 

22 May, 2022 04:27 IST|Sakshi
మాట్లాడుతున్న రవీంద్రనాథ్‌ బాబు

అతన్ని వెంటనే అదుపులోకి తీసుకుంటాం 

కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు వెల్లడి 

సుబ్రహ్మణ్యం కుటుంబీకులు పోస్టుమార్టానికి సహకరించకపోవడం వల్లే ఆలస్యం  

విచారణలో సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినట్లు తేలితే అరెస్టు చేస్తాం  

కేసు తీవ్రత దృష్ట్యా పారదర్శకంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశం

సాక్షి, అమరావతి/సాక్షి, కాకినాడ/కాకినాడ సిటీ: డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును ప్రధాన నిందితుడిగా భావిస్తున్నామని కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. అనుమానాస్పద మృతి కింద నమోదు చేసిన కేసును హత్య కేసుగా మార్పు చేస్తున్నామని, అనంతబాబును వెంటనే అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. విచారణ తర్వాత అరెస్టు చేయాల్సి వస్తే చేస్తామని స్పష్టం చేశారు. సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు సహకరించక పోవడం వల్లే పూర్తి వివరాలు సేకరించడం ఆలస్యమైందని చెప్పారు. కాకినాడలో శనివారం రాత్రి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏం చెప్పారంటే.. 

► ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర సుబ్రహ్మణ్యం ఐదారు సంవత్సరాలుగా డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. 3 నెలల క్రితం అతన్ని విధుల నుంచి తొలగించారు. సుబ్రహ్మణ్యం 20వ తేదీన అనుమానాస్పదంగా చనిపోయినట్లు అతని తల్లి రత్నం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశాం. 

► ఫిర్యాదు ప్రకారం.. సుబ్రహ్మణ్యం ఇంటి దగ్గర నుంచి సాయంత్రం 7.30 – 8 గంటల మధ్య మణికంఠ అనే కుర్రాడు వస్తే అతనితో కలిసి బయటకు వెళ్లాడు. రాత్రి 9 గంటలకు వాళ్ల తల్లి ఫోన్‌ చేస్తే త్వరగానే ఇంటికి వస్తానని చెప్పాడు. ఆ తర్వాత అదేరోజు అర్ధరాత్రి 12.30 గంటలకు అనంతబాబు దగ్గర నుంచి వారి తండ్రికి ఫోన్‌ వచ్చింది. 

► సుబ్రహ్మణ్యం ప్రమాదానికి గురై స్పృహ తప్పి పడిపోయాడని, తాను అక్కడికి వెళుతున్నానని ఆయన చెప్పాడు. మళ్లీ 1.30 గంటలకు వాళ్ల రెండో అబ్బాయి నవీన్‌కు ఫోన్‌ చేశాడు. సుబ్రహ్మణ్యం స్పృహ తప్పి పడిపోయి ఉంటే భానుగుడి జంక్షన్‌లో ఉన్న అమృత హాస్పిటల్‌కి తీసుకు వస్తున్నానని, మీరు కూడా రావాలని వాళ్లకి చెప్పాడు.  

► దీంతో నవీన్, అతని స్నేహితులు ఆస్పత్రికి వెళ్లినప్పుడు వాళ్ల సమక్షంలోనే డాక్టర్లు సుబ్రహ్మణ్యంను పరిశీలించి చనిపోయినట్లు ధ్రువీకరించారు. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం మృతదేహంతోపాటు అతని సోదరుడు, స్నేహితుల్ని అనంతబాబు తన వాహనంలో కొండాయపాలెంలోని వాళ్ల తల్లితండ్రులు ఉండే ఆపార్టుమెంట్‌ (అతని తండ్రి సత్యనారాయణ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు) దగ్గరకు తీసుకెళ్లారు.  

► మృతదేహంతోపాటు ఎమ్మెల్సీ తెల్లవారుజామున 4 గంటల వరకు అక్కడే ఉండి.. వారు నిలదీయడంతో కారు, మృతదేహాన్ని అక్కడే వదిలి వెళ్లారు. ఈ మరణం ఎలా జరిగిందనే దానిపై అనుమానాలున్నాయి కాబట్టి ఫిర్యాదును బట్టి కేసు రిజిస్టర్‌ చేశాం.  

► ఈ కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వాస్తవాలు, ఆధారాలను బట్టి పారదర్శకంగా సీనియర్‌ అధికారులతో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు. డీజీపీ ప్రతి గంటకు కేసును సమీక్షించారు. అనుమానాస్పద మృతి కేసు నమోదైంది కాబట్టి మృతదేహాన్ని శవపంచనామా చేస్తున్నప్పుడు రక్త సంబంధీకుల వాంగ్మూలాలు తీసుకోవాలి. వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటాం. 

► శవ పంచనామా అయిన వెంటనే పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పంపాలి. కానీ బంధువులకు ఉన్న అనుమానాల నేపథ్యంలో సహకరించలేదు. శవ పంచనామాకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని కోరినా రాలేదు. చివరికి వారిని ఒప్పించి మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకువచ్చి శవ పంచనామా మొదలుపెట్టాం. సుబ్రహ్మణ్యం తల్లితండ్రులు, అతని భార్య, ఇతరులను విచారించాం.   
 
పోస్టుమార్టం తర్వాతే స్పష్టత 
► అనంతబాబుపై తమకు అనుమానం ఉందని, ఆయనే ప్రధాన నిందితుడని వాళ్ల కుటుంబ సభ్యులు చెప్పారు. వాళ్లు ఇచ్చిన ఆధారాల ప్రకారం ప్రస్తుతానికి అనంతబాబును ప్రధాన నిందితుడుగా భావిస్తున్నాం. మరణానికి కారణం పోస్టుమార్టం తర్వాత తెలుస్తుంది.  

► శవ పంచనామా తర్వాత పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేస్తాం. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి. సుబ్రహ్మణ్యం తల్లితండ్రులు, అతనితో మద్యం సేవించిన మిత్రులు, పరిశీలించిన వైద్యులు, మిగిలిన సాక్షులను యుద్ధ ప్రాతిపదికన విచారిస్తాం. కేసును 302 సెక్షన్‌గా మార్చబోతున్నాం. ఎమ్మెల్సీ అనంతబాబును వెంటనే అదుపులోకి తీసుకుంటాం. విచారణ జరిపి చట్ట పరంగా అరెస్టు చేయాల్సి వస్తే చేస్తాం. 

మరిన్ని వార్తలు