దుర్గ హత్య కేసు: అందరూ ఒకే కుటుంబానికి  చెందినవారు

19 May, 2021 09:02 IST|Sakshi
నిందితుల వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ మాధవరెడ్డి, సీఐ బాజీలాల్, ఎస్సైలు

అమలాపురం: పట్టణంలో ఇటీవల జరిగిన మహిళ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సమనస గ్రామానికి చెందిన కొండ్రు దుర్గను ప్రత్యర్థులైన బాలయోగి ఎలియాస్‌ చిరంజీవి కుటుంబీకులు పాత కక్షలతోనే హత్య చేశారని డీఎస్పీ వై.మాధవరెడ్డి తెలిపారు. ఈ నెల 14వ తేదీ సాయంత్రం అమలాపురం ఎన్టీఆర్‌ మార్గ్‌లో చిరంజీవి కుటుంబీకులు మారణాయుధాలతో దారి కాసి, దాడి చేసి దుర్గను హతమార్చిన సంగతి తెలిసిందే. దాడిలో హతురాలు దుర్గ కుమారుడు కొండ్రు రమేష్‌ను కూడా కత్తులతో తీవ్రంగా గాయపరిచారు. అతడు కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు. అతడి ఫిర్యాదు మేరకు దుర్గ హత్య కేసులో చిరంజీవి కుటుంబానికి చెందిన ఐదుగురిని మంగళవారం సాయంత్రం అమలాపురంలో అరెస్ట్‌ చేసి, కోర్టులో హాజరు పరచినట్లు డీఎస్పీ మాధవరెడ్డి చెప్పారు.

పట్టణ సీఐ ఆర్‌ఎస్‌కే బాజీలాల్‌తో కలసి పట్టణ పోలీసు స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ మాధవరెడ్డి వివరాలు వెల్లడించారు. సమనస శివారు మంగంవారిపేటకు చెందిన మంగం బాలయోగి ఎలియాస్‌ చిరంజీవి (తండ్రి), మంగం మంగ (తల్లి), మంగం నవీన్‌ (కొడుకు), మంగం విజయ్‌ (కొడుకు), అల్లవరం మండలం గుండెపూడికి చెందిన చొప్పల శ్రీను (అల్లుడు)లను అరెస్టు చేశారు. ఆ రోజు హత్యకు ఉపయోగించిన కత్తి, గొడ్డలి, ట్రక్‌ ఆటో, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 

ఇదీ నేపథ్యం 
సమనస గ్రామంలో కొండ్రు కోటేశ్వరరావు, మంగం చిరంజీవి కుటుంబాలు ఎదురెదురు ఇళ్లలో ఉంటున్నాయి. రెండేళ్లుగా దారి గొడవలు, ఇతర తగాదాలతో ఈ రెండు కుటుంబాల మధ్య పాత కక్షలు పెరిగాయి. పెద్దల సమక్షంలో తగవులు జరిగినా వారి మధ్య పగ, ప్రతీకారాలు చల్లారలేదు. ఈ నేపథ్యంలో కోటేశ్వరావు కుటుంబాన్ని హతమార్చాలని చిరంజీవి కుటుంబం పథకం పన్నింది. ఈ నేపథ్యంలో ఎనిమిది నెలల ముందే తమ నివాసాన్ని సమనస నుంచి అమలాపురం పట్టణంలోని కొంకాపల్లికి తాత్కాలికంగా మార్చారు. అదును చూసి కోటేశ్వరరావు కుటుంబాన్ని హతమార్చేందుకు మారణాయుధాలు సిద్ధం చేసుకున్నారు.

ముందస్తు పథకంలో భాగంగానే ఈ నెల 14న సమనసలో కుటుంబ పెద్దయిన కోటేశ్వరరావుపై చిరంజీవి కొడుకు నవీన్‌ కత్తితో దాడికి విఫలయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో అమలాపురంలోని ఒకరి ఇంటికి రోజూ పనికి వెళ్లే కోటేశ్వరరావు భార్య దుర్గను కుమారుడు రమేష్‌ మోటార్‌ సైకిల్‌పై ఇంటికి తీసుకువస్తుంటాడు. ఆ సమయాన్ని తమ హత్యకు అదునుగా ఉపయోగించకోవాలని చిరంజీవి కుటుంబీకులు పథకం వేసింది. ఈ నేపథ్యంలోనే వారు మారణాయుధాలతో ఎన్టీఆర్‌ మార్గ్‌లో మాటు వేసి దుర్గను, ఆమె కొడుకు రమేష్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నారు. దుర్గను హతమార్చగా, రమేష్‌ తీవ్రగాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. 
చదవండి: సహజీవనం: ట్రాన్స్‌జెండర్‌ అనుమానాస్పద మృతి 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు