11ఏళ్ల అనంతరం వీడిన మర్డర్‌ మిస్టరీ!

11 Jul, 2022 04:11 IST|Sakshi
ప్రియాంక హుచ్చప్ప (ఫైల్‌ )

కట్టుకున్న వాడే కాలయముడు 

మృతురాలు కర్ణాటకకు చెందిన ప్రియాంక హుచ్చప్పగా గుర్తింపు  

2011 జూలైలో నల్లమల అడవిలో లభ్యమైన యువతి మృతదేహం  

దళిత యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న నెపంతో హత్య  

మృతురాలి భర్త, అతని సోదరుడు కలిసి హతమార్చినట్లు వెల్లడి   

పెద్దదోర్నాల: పదకొండేళ్ల క్రితం సంచలనం సృష్టించిన యువతి మర్డర్‌ మిస్టరీ ఎట్టకేలకు వీడింది. వివాహేతర సంబంధం నెరుపుతుందనే కారణం చూపి సోదరుడితో కలిసి కట్టుకున్న ఇల్లాలు ప్రియాంకను (19)ను దారుణంగా హతమార్చాడు కర్ణాటకకు చెందిన ఉపాధ్యాయుడు హుచ్చప్ప. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం విజయపూర్‌ జిల్లా వాదావేన్‌ తాలూకా ముధుదేహాల్‌కు చెందిన హుచ్చప్ప, ప్రియాంక భార్యాభర్తలు. కొన్నాళ్లపాటు అన్యోన్యంగానే కాపురం కొనసాగించారు.

ఈ నేపథ్యంలో ప్రియాంక ఓ దళిత యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయాన్ని గమనించిన భర్త హుచ్చప్ప పద్ధతి మార్చుకోవాలని భార్యను పలుమార్లు హెచ్చరించాడు. అయితే భర్త మాటలను పెడచెవిన పెట్టిన ప్రియాంక.. వివాహేతర సంబంధం కొనసాగించేది. దీంతో ఎలాగైనా భార్యను చంపేయాలని భావించిన హుచ్చప్ప పక్కాగా ప్లాను వేశాడు. దైవదర్శనం కోసం శ్రీశైల పుణ్యక్షేత్రానికి వెళదామంటూ తన సోదరుడు, భార్యతో కలిసి బయలు దేరాడు.

ఈ నేపథ్యంలో శ్రీశైలంలో దర్శనం పూర్తి చేసుకున్న వీరు 2011వ సంవత్సరం జూలై 25 తేదీ అర్ధరాత్రి ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని కొర్రప్రోలు సమీపంలోకి రాగానే ముందుగా వేసుకున్న పథకం ప్రకారం సోదరుడి సహాయంతో నైలాన్‌ తాడును ప్రియాంక గొంతుకు బిగించి హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు .. ఒంటిపై ఉన్న దుస్తులను తొలగించి లోదుస్తులతో ఉన్న మృతదేహాన్ని రోడ్డు పక్కనే ఉన్న చప్టాలో పడేసి కర్ణాటకకు చేరుకున్నారు.

ఈ హత్య విషయం మృతురాలి తల్లిదండ్రులకు తెలిసినా, కుమార్తె ప్రవర్తనతో విసిగిపోయిన వారు కూడా మౌనంగానే ఉన్నారు. ఈ క్రమంలో పరిచయం ఉన్న వారు నీ భార్య ఏదంటూ అడగగా, ఆమె ఎవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకుని వెళ్లిపోయిందంటూ అందరినీ నమ్మించాడు. అప్పట్లో కేసు నమోదు చేసుకున్న దోర్నాల పోలీసులు దీనిపై చాలా కాలం విచారణ చేపట్టి విసిగి పోయారు. 

ప్రియాంక హత్య విషయం బయట పడిందిలా.. 
ప్రియాంకను భర్తే హతమార్చిన విషయం బంధువులందరికీ తెలిసినా ప్రియాంక ప్రవర్తన, నడవడిక కారణంగా ఎవరూ ఆ విషయాన్ని బయట పెట్టకుండా మనస్సులోనే దాచుకున్నారు. హుచ్చప్పకు, అతని దాయాదులకు ఆస్తి పంపకాల్లో  నెలకొన్న విభేదాల కారణంగా మనస్పర్థలు వచ్చాయి. దీంతో వారు ప్రియాంక హత్యకు గురైన విషయాన్ని కర్ణాటకకు చెందిన పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో  విషయం వెలుగు చూసింది.

గతేడాది జూన్‌ 1వ తేదీన మిస్సింగ్‌ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో కర్ణాటక పోలీసులు విచారణ చేపట్టి నిందితులు చెప్పిన ఆధారాల మేరకు పెద్దదోర్నాల పోలీసు స్టేషన్‌కు చేరుకోవడంతో అసలు విషయం బయట పడింది. దీంతో భర్త, అతని సోదరుడిపై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు.   

మరిన్ని వార్తలు