వైఎస్సార్‌సీపీ నేత హత్య

10 Oct, 2020 04:36 IST|Sakshi
హతుడు సుబ్బరాయుడు (ఫైల్‌)

కట్టెలతో కొట్టి చంపేశారు 

కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం 

నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాలలో వైఎస్సార్‌సీపీ నాయకుడు, న్యాయవాది వుడూరు సుబ్బరాయుడు (50) శుక్రవారం దారుణహత్యకు గురయ్యారు. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన ఆయన్ని దుండగులు కట్టెలతో కొట్టి హత్యచేశారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ వార్డు ఇన్‌చార్జిగా ఉన్న ఆయనపై 2017 ఆగస్టు 14న నంద్యాల ఉప ఎన్నిక సమయంలోనూ హత్యాయత్నం జరిగింది. రోజూ వాకింగ్‌కు వెళ్లే సమాచారం తెలుసుకున్న ప్రత్యర్థులు పథకం ప్రకారం మాటువేసి ఆయన్ని హత్యచేశారని భావిస్తున్నారు. నంద్యాల డీఎస్పీ చిదానందరెడ్డి తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల పట్టణం పొన్నాపురానికి చెందిన సుబ్బరాయుడు ఉదయం ఆరుగంటలకు భార్య అరుణకుమారి, కోడలు వసంతతో కలిసి చాబోలు రస్తాకు వాకింగ్‌కు వెళ్లారు. విజయ పాల డెయిరీ నుంచి ఆయన భార్య, కోడలు ఇంటికి తిరిగి వచ్చారు.

తరువాత ఎంతసేపటికి సుబ్బరాయుడు ఇంటికి రాకపోవడంతో కుమారుడు రాము బైక్‌పై వెళ్లి చూడగా డెయిరీ వెనుకవైపు చాబోలు రహదారిలోని చింతలకుమార్‌ వెంచర్‌లో మృతదేహం కనిపించింది. సమాచారం అందటంతో అక్కడికి చేరుకున్న డీఎస్పీ క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌ను రప్పించారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి అక్కడికి చేరుకుని బాధిత కుటుంబసభ్యులను ఓదార్చారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం పాటుపడుతూ చురుకైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సుబ్బరాయుడి హంతకుల్ని కఠినంగా శిక్షించాలని కోరారు. సుబ్బరాయుడి ఎదుగుదలను ఓర్వలేక టీడీపీ నాయకులు ఆయన్ని చంపేశారా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుబ్బరాయుడిని రాజకీయ ప్రత్యర్థులే హత్యచేశారా లేక వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ చెప్పారు.  

మరిన్ని వార్తలు