ఎంపీ అర్వింద్‌ కాన్వాయ్‌పై గ్రామస్తుల దాడి

16 Jul, 2022 06:34 IST|Sakshi

కారు అద్దాలు ధ్వంసం 

జగిత్యాల జిల్లా ఎర్దండిలో ఘటన  

ఇబ్రహీంపట్నం/కోరుట్ల/జగిత్యాల: వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ కాన్వాయ్‌పై ఎర్దండి గ్రామస్తులు దాడి చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎస్సారెస్పీ ప్రాజెక్టునుంచి నీటిని గోదావరి నదిలోకి విడుదల చేశారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిని ఆ వరద చుట్టుముట్టింది. బాధితులను పరామర్శించి, గోదావరి వరదపై సమీక్షించేందుకు ఎంపీ అర్వింద్‌ శుక్రవారం ఆ గ్రామానికి చేరుకున్నారు.

ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ‘ఎంపీ అర్వింద్‌ డౌన్‌ డౌన్‌.. గో బ్యాక్‌’అని నినాదా లు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఓ గ్రామస్తుడు ఎంపీకి చెప్పుల దండ వేసేందుకు య త్నించాడు. పోలీసులు అడ్డుకుని అతడిని పక్క కు పంపించారు. తమ గ్రామంలో భూ సమస్యను పరిష్కరించకుండా ఎందుకు వచ్చారని గ్రామస్తులు ఆయనను నిలదీశారు.

పోలీసులు నిరసనకారులను అడ్డుకుని పంపించారు. దీంతో ఎంపీ గోదావరి నది వద్దకు వెళ్లి వరద పరిస్థితి సమీక్షించి వెనుదిరిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మరోసారి ఆయన కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. కొందరు ఆగ్రహంతో ఎంపీ కారుపై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ఎంపీ కారు వెనుకాల అద్దం పగిలిపోయింది. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి తలెత్తడంతో పోలీసులు బందోబస్తు మధ్య ఎంపీని అక్కడినుంచి పంపించివేశారు. కారుపై దాడి చేసిన ఓ వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

గోదావరి వరద ముంపు కారణంగా 1996లో ఎర్దండి గ్రామంలోని 200 మందికి సమీపంలోని బర్ధీపూర్‌లో భూములు కేటాయించారు. అయితే గతంలోనే బర్ధీపూర్‌లోని మరికొందరికి కూడా ఆ భూములు కేటాయించారు. ఒకే సర్వేనంబర్‌లోని భూములు కావడంతో అది వివాదంగా మారింది. ఏడాది కిందట విజ్ఞప్తి చేసినా తమ సమస్య పరిష్కరించలేదని ఎర్దండి వాసులు ఎంపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

ఇది మంత్రి, ఎమ్మెల్యేల కుట్ర: అర్వింద్‌ 
తమ భూ దందాలు బయట పడతా యన్న భయంతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు తనపై దాడి చేయించారని ఎంపీ అర్వింద్‌ ఆరోపించారు. శుక్రవారం కోరుట్లలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిర్మల్‌ ప్రాంతానికి చెందిన ఎస్సారెస్పీ ముంపు బా«ధితులకు ఎర్దండిలో రోడ్డు వెంట కేటాయించిన భూమిని ఆక్రమించాలన్న లక్ష్యంతో కుట్ర లు చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ గూండాలను ఉసిగొలిపి తన కారు అద్దాలు ధ్వంసం చేయడం సిగ్గుచేటన్నారు. 

చదవండి: వరద విరుచుకుపడినా నిలబడిన కడెం.. చరిత్రలో తొలిసారి భీకర దృశ్యాలు

అర్వింద్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఫోన్‌ 
ఎంపీ అర్వింద్‌ కాన్వాయ్‌పై జరిగిన దాడిని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఖండించారు. దాడి జరిగిందనే సమాచారం తెలియగానే అమిత్‌ షా అర్వింద్‌కు ఫోన్‌చేసి ఘటనపై ఆరా తీశారు. పథకం ప్రకారమే తనపై దాడి జరిగిందని, అమిత్‌ షాకు అర్వింద్‌ వివరించా రు. నియోజకవర్గం పరిధిలో తాను ఎక్కడ పర్యటించినా దాడులు చేయాలని టీఆర్‌ఎస్‌ నాయకత్వం ఎమ్మెల్యేలకు సూచించిందని ఆయన అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లా రు. దాడి వెనుక కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు హస్తం ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా, ఆర్వింద్‌పై దాడి ఘటనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఖండించారు. 

మరిన్ని వార్తలు