మద్యం మత్తులోనే వందేభారత్‌ రైలుపై దాడి

13 Jan, 2023 04:10 IST|Sakshi
వందేభారత్‌ రైలును పరిశీలిస్తున్న డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ సత్పతి

పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు

రైలును పరిశీలించిన డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ సత్పతి

తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): నిర్వహణ పనుల నిమిత్తం విశాఖకు వచ్చి.. బుధవారం కోచింగ్‌ కాంప్లెక్స్‌కు వెళ్తున్న వందేభారత్‌ రైలుపై రాళ్లు వేసిన నిందితులను స్థానిక పోలీసులు, జీఆర్‌పీ పోలీసుల సహకారంతో రైల్వే భద్రతా దళం పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బుధవారం సాయంత్రం కంచరపాలెం రైల్వే గేటు వద్ద మద్యం మత్తులో ఉన్న శంకర్, చందు, రాజు అనే వ్యక్తులు కొత్త రైలు వెళ్లడం గమనించి రాళ్లతో దాడి చేశారు.

గమనించిన ఆర్పీఎఫ్‌ సిబ్బంది ఆ ముగ్గురినీ వెంబడించగా శంకర్‌ చెప్పును వదిలేసి పారిపోయాడు. రైల్వే పోలీసులకు సహకరించాలని నగర పోలీస్‌ కమిషనర్‌ సీహెచ్‌ శ్రీకాంత్‌ స్థానిక పోలీసులకు ఆదేశించగా.. వెస్ట్‌ ఏసీపీ, కంచరపాలెం సీఐ, టాస్క్‌ఫోర్స్, జీఆర్పీ, ఆర్పీఎఫ్‌ పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలించారు. సీసీ టీవీ ఫుటేజి ఆధారంగా నిందితులు ముగ్గురినీ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆ ముగ్గురూ పాత కేసుల్లో నిందితులని పోలీసులు తెలిపారు. 

న్యూ కోచింగ్‌ కాంప్లెక్స్‌లో వందేభారత్‌ రైలును వాల్తేర్‌ డివిజన్‌ డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ సత్పతి గురువారం తనిఖీ చేశారు. రైలులో ఎల్లవేళలా అందుబాటులో ఉండే ఆన్‌బోర్డ్‌ టెక్నీషియన్స్‌తో డీఆర్‌ఎం మాట్లాడారు. బుధవారం రాత్రి ఈ రైలును కోచ్‌ కేర్‌ సెంటర్‌కు తరలిస్తున్న సమయంలో కంచరపాలెం వద్ద ఆకతాయిల వల్ల దెబ్బతిన్న పగిలిన కోచ్‌ల అద్దాలను పరిశీలించారు.

పాక్షికంగా పగిలిన అద్దాలను న్యూకోచింగ్‌ కేర్‌ సెంటర్‌లో మార్చారు. గురువారం రాత్రికే ఈ రైలును సికింద్రాబాద్‌ పంపించేందుకు వాల్తేర్‌ డివిజన్‌ అధికారులు ఏర్పాటు చేశారు. ఏడీఆర్‌ఎం (ఆపరేషన్స్‌) మనోజ్‌కుమార్‌ సాహూ, సీనియర్‌ డివిజినల్‌ సె­క్యూ­­రిటీ కమిషనర్‌ సీహెచ్‌ రఘువీర్, సీనియర్‌ కో­చింగ్‌ డిపో ఆఫీసర్‌ మోనిష్‌ బ్రహ్మ, సీనియర్‌ డివిజనల్‌ మెకానికల్‌ ఇంజనీర్‌ ఎస్‌కే పాత్ర పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు