లాయర్‌ తలకు తుపాకీ గురి.. భూవివాదం

23 Feb, 2021 14:29 IST|Sakshi

కేసు ఓడిపోయాడని ఓ లాయర్‌పై హత్యాయత్నం 

విషయాన్ని రహస్యంగా ఉంచిన పోలీసులు 

సాక్షి, హైదరాబాద్‌: భూ వివాదానికి సంబంధించి న్యాయస్థానంలో తాము కేసు ఓడిపోవడానికి న్యాయవాదే కారణమని భావించిన కక్షిదారులు దారుణానికి తెగబడ్డారు. సదరు న్యాయవాదిపై హత్యాయత్నం చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న నారాయణగూడ పోలీసులు నిందితుల్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గతవారం జరిగిన ఈ విషయాన్ని అధికారులు రహస్యంగా ఉంచడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హిమాయత్‌నగర్‌ స్ట్రీట్‌ నంబర్‌ 7లో ఉండే హైకోర్టు న్యాయవాది జశ్వంత్‌ ఓ భూ వివాదానికి సంబంధించిన కేసు వాదిస్తున్నారు. ఈ కేసులో ఇటీవల కక్షిదారులకు వ్యతిరేకంగా తీర్పువచ్చింది. న్యాయవాది నిర్లక్ష్యం వల్లే తాము కేసు ఓడిపోయామని కక్షిదారులు భావించారు.

దీంతో కక్షకట్టిన వాళ్లు ఈ నెల 17 సాయంత్రం 6 గంటల సమయంలో గౌడ హాస్టల్‌ సమీపంలో న్యాయవాదిని అడ్డగించి బాహాబాహీకి దిగారు. భూ యజమాని తరఫు వాళ్లు తమ వెంట తెచ్చుకున్న తుపాకీని న్యాయవాది తలకు గురిపెట్టడంతో పాటు కత్తితో పొడిచేందుకు సిద్ధపడ్డారు. అక్కడకు చేరిన స్థానికులు తమ ఫోన్లలో వీడియోలు తీస్తుండటాన్ని గమనించిన వాళ్లు వెనక్కు తగ్గారు. డయల్‌–100 ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఇరువైపుల వారినీ అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం, సెక్టార్‌ ఎస్సై కాకుండా మరొకరికి దర్యాప్తు బాధ్యతలు అప్పగించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు