మహిళపై అఘాయిత్యానికి నేపాల్‌ యువకుల యత్నం

8 Jun, 2023 04:11 IST|Sakshi

బస్టాండ్‌లో ఒంటరిగా ఉన్న మహిళను ఆటోలో తీసుకెళ్లిన యువకులు  

తప్పించుకున్న మహిళ.. సమీపంలోని యువకుడి సాయంతో దిశ యాప్‌లో ఫిర్యాదు   

వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మహిళను కాపాడిన పోలీసులు

కందుకూరు: అర్ధరాత్రి ఊరికి వెళ్లేందుకు బస్టాండ్‌లో ఒంటరిగా ఉన్న మహిళపై కన్నేసిన ముగ్గురు యువకులు అఘాయిత్యానికి విఫలయత్నం చేశారు. దిశ యాప్‌లో వచ్చి న ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు నేపాల్‌కు చెందిన యువకులు కాగా, మరొకరు పట్టణానికి చెందిన యువకు­డు. మంగళవారం అర్ధరాత్రి నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని మాచవరం రోడ్డులో ఈ ఘటన జరిగింది.

డీఎస్పీ రామచంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. మాచవరం గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన ఓ మహిళ మంగళవారం సాయంత్రం వ్యక్తిగత పనులపై పట్టణానికి వచ్చింది. అయితే ఆల­స్యం కావడంతో రాత్రి 11 గంటల వరకు పట్టణంలోనే ఉండిపోయింది. ఆ సమయంలో తమ ఊరికి వెళ్లే బస్సు కోసం పామూరు బస్టాండ్‌లో వేచి చూస్తోంది. అదే సమయంలో కందుకూరు పట్టణంలోని గూర్ఖాలుగా పనిచేస్తున్న నేపాల్‌కు చెందిన యువకులు కరణ్, జ్యోషిలతో పాటు, పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్‌ సయ్యద్‌ ఫిరోజ్‌ ముగ్గురూ మహిళ వద్దకు వచ్చారు. ఆమెను బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని మాచవరం వైపు తీసుకెళుతున్నారు.

ఎస్‌ఆర్‌ పెట్రోల్‌ బంకు సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్త­మైన ఆమె అక్కడి నుంచి తప్పించుకుని పె­ట్రోల్‌ బంకు వద్దకు చేరుకుంది. దీంతో పెట్రోల్‌ బంకులో పనిచేసే యువకుడు దిశ యాప్‌ ద్వారా పోలీసులకు సమాచారం ఇ­చ్చా­డు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళకు రక్షణ కల్పించి యువకుల కోసం గాలించారు. అయితే అప్పటికే వారు పారిపోవడంతో ఆటో ఆధారంగా బుధవారం నిందితులు ముగ్గురినీ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు