మాట వినడం లేదని అత్తను హత్యచేసిన అల్లుడు

6 Dec, 2020 08:12 IST|Sakshi
అత్తను హత్య చేసేందుకు వాడిన కారు  

సాక్షి, తాడేపల్లిగూడెం అర్బన్‌: తన మాట వినడం లేదని అత్తను అల్లుడే హత్యచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 1న తాడేపల్లిగూడెం 11వ వార్డు చెట్లరోడ్డులో మహిళ మృతి చెందిన సంఘటనపై పోలీసుల దర్యాప్తుతో ఈ విషయం వెలుగుచూసింది. తాడేపల్లిగూడెం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. షేక్‌ ఉస్మాన్‌ బాషా తాడేపల్లిగూడెంలో అంబులెన్సులు నడిపేవాడు. అతని అత్త రఫీ ఉన్సీసా ఇద్దరు కుమారులతో తాడేపల్లిగూడెం పట్టణంలోని 8వవార్డులో ఉంటుంది. ఇద్దరు కుమారులు వ్యసనాలకు బానిసలై తల్లిని పట్టించుకునేవారు కాదు.

అత్తకున్న ఆస్తిలో కొంత పొలాన్ని అమ్మి డబ్బులిస్తే ఇల్లు కట్టిస్తానని అల్లుడు బాషా తరచూ చెప్పేవాడు. దీనికి ఆమె ఒప్పుకోలేదు. తన మాట వినడంలేదని కోపంతో ఆమెను హత్య చేయాలని పథకం వేశాడు. నవంబరు 30న ఆమె చిన్నకొడుకుకు నాటు మందు ఇప్పిస్తానని నమ్మించి అత్త ఉన్నీసాను కారులో ఎక్కించుకుని అనంతపల్లికి తీసుకెళ్లాడు. తిరిగి వెంకట్రామన్నగూడెం తీసుకువచ్చి ముత్యాలమ్మ ఆలయం వద్ద ఆమెను వదిలి నాటు మందు తీసుకొస్తానని వెళ్లాడు. చీకటిపడే వేళకు వచ్చి అత్తపై స్క్రూడ్రైవర్‌తో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె మృతి చెందకపోవడంతో ఉన్నీసా ధరించిన చీరను మెడకు బిగించి హత్యచేశాడు. మృతదేహాన్ని కారులోకి చేర్చి తాడేపల్లిగూడెంలోని ఆమె ఉంటున్న ఇంటికి తీసుకొచ్చాడు. చదవండి: ('నన్ను వెతకకండి.. నేను చనిపోతున్నా..’)

పోలీసులకు వీఆర్వో సమాచారం 
తర్వాత రోజు ఉదయం పెద్దకుమారుడు వచ్చి చూసేసరికి తల్లి మృతిచెంది ఉండడాన్ని గమనించాడు. అతను బాషాకు సమాచారం అందించగా.. విషయం పోలీసులకు చెప్పవద్దని కేసు, పోస్టుమార్టం అంటూ ఇబ్బంది పెడతారంటూ ఇద్దరు కుమారులను అంత్యక్రియలకు ఒప్పించాడు. అక్కడి నుంచి అత్త మృతదేహాన్ని తాను అద్దెకుంటున్న ఇంటికి చేర్చాడు. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా విషయం తెలుసుకున్న వీఆర్వో వచ్చి పరిశీలించాడు. హత్య చేసినట్లు ఉందని పోలీసులకు సమాచారం అందించాడు. ఈలోగా బాషా తన కారుతో పరారయ్యాడు. అనుమానం వచ్చిన పోలీసులు బాషా కోసం వెతకడం మొదలుపెట్టారు. ఈ నెల 4న వెంకట్రామన్నగూడెం అడ్డరోడ్డులో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. అత్త ఉన్నీసాను తానే హత్యచేసినట్లు అంగీకరించాడు. పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు తరలించగా రిమాండ్‌ విధించినట్లు సీఐ ఆకుల రఘు తెలిపారు.    చదవండి:  (అమెరికాలో చిత్తూరు జిల్లా మహిళ మృతి)

మరిన్ని వార్తలు