అడ్డదారిలో అక్రమ కిక్కు..!

23 Aug, 2021 07:59 IST|Sakshi
మద్యంతో పట్టుబడిన వారిని అరెస్ట్‌ చూపుతున్న అధికారులు (ఫైల్‌)

పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం రవాణా

కేసులు నమోదు చేస్తున్నా మారని తీరు

జిల్లాలో విచ్చలవిడిగా విక్రయాలు

ఒప్పంద కూలీలుగా యువకులు

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో సరిహద్దు ప్రాంతాల నుంచి పండ్లు, పాలు, కూరగాయల మాటున పొరుగు రాష్ట్రాల మద్యాన్ని అడ్డదారుల్లో అక్రమంగా తరలిస్తున్నారు. అధికారులు దాడులు చేసి, కేసులు నమోదు చేస్తున్నా ఈ దందా ఆగడం లేదు.

చదవండి: తిరుమల లడ్డూల కోసం పర్యావరణహిత సంచి.. 

కర్నూలు: జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఏడు అంతర్రాష్ట్ర, పది జిల్లా సరిహద్దు చెక్‌పోస్టులున్నాయి. వీటిలో సెబ్‌ అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ పొరుగు రాష్ట్రాల నుంచి జిల్లాలోకి భారీగా మద్యం తరలివస్తోంది. పోలీసులు నాలుగు కేసులు పట్టుకుంటే 40 కేసుల మద్యాన్ని జిల్లాకు తీసుకొస్తున్నారు. కొందరు ఇదే వృత్తిగా మార్చుకుని పోలీసులకు సవాల్‌ విసురుతున్నారు. కర్ణాటక, తెలంగాణల రాష్ట్రాల నుంచి జిల్లాలోకి వచ్చేందుకు పలు అడ్డదారులున్నాయి.

నిత్యం వందల సంఖ్యలో ద్విచక్ర వాహనాలపై, కాలినడకన నెత్తిన పెట్టుకుని పొరుగు మద్యాన్ని జిల్లాలోకి తీసుకొస్తున్నారు. సెబ్‌ అధికారులు ప్రధాన రోడ్లపైనే దృష్టి సారిస్తుండటంతో అడ్డదారుల్లో అక్రమదందా సాగిస్తున్నారు. గతంలో మద్యం దుకాణాలు నిర్వహించిన వారు తమ అనుచరుల ద్వారా ఈ దందాను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. కర్నూలు సమీపంలోని పంచలింగాల, ఈ. తాండ్రపాడు, తిమ్మనదొడ్డి, చిన్న దన్వాడ, కేశవరం, రాజోలి నుంచి తెలంగాణ మద్యం కర్నూలుకు వస్తోంది. అలాగే చిన్న మంచాల, పుల్లాపురం, గుండ్రేవుల, చెట్నేపల్లి నుంచి కర్ణాటక మద్యం తరలుతోంది.

మహిళలు, యువకుల ద్వారా.. 
విడతల వారీగా మద్య నిషేధం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలు పెంచింది. అలాగే దుకాణాలను సైతం తగ్గించింది. పొరుగు రాష్ట్రాల్లో మద్యం ధరలు తక్కువగా ఉండడంతో జిల్లాలోకి అక్రమంగా తరలించి అమ్ముకుంటున్నారు.  తక్కువ సమయంలో అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు మద్యం అక్రమ రవాణాలో మహిళలను సైతం ఉపయోగిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి 8 నెలల వ్యవధిలో జిల్లాలో 22 మంది మహిళలు మద్యం రవాణా చేస్తూ పట్టుబడ్డారు. అక్రమ మద్యం వ్యాపారులు నిరుద్యోగ యువకులకు సైతం వల వేస్తున్నారు.

వారికి ద్విచక్ర వాహనాలిచ్చి మద్యం తీసుకొస్తే విడతకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ముట్టజెబుతున్నారు. కడప రిమ్స్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ చదువుతున్న ఇద్దరు, డిగ్రీ చదువుతున్న మరొకరు, అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలానికి చెందిన ఎంబీఏ విద్యార్థి డబ్బు కోసం ఆశపడి మద్యం రవాణా చేస్తూ తనిఖీల్లో దొరికిపోయారు. ఒప్పంద కూలీల వ్యవహారం వీరి ద్వారా బయటపడటంతో తనిఖీ అధికారులే విస్తుపోయారు. ఇలా పట్టుబడిన వారిలో జిల్లాకు చెందిన విద్యార్థులతో పాటు తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారు. ఎనిమిది నెలల వ్యవధిలోనే 56 మంది విద్యార్థులు, వందల సంఖ్యలో యువకులు పొరుగు మద్యం రవాణా చేస్తూ తనిఖీల్లో పట్టుబడ్డారు.

  •  ఈ నెల 11వ తేదీన మిరపకాయల మాటున మినీలారీలో అక్రమంగా తరలిస్తున్న 90 బాక్సుల కర్ణాటక మద్యాన్ని  కోడుమూరులోని పత్తికొండ రోడ్డులో సెబ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.   
  •  ఈ నెల 12వ తేదీన కర్నూలు ముజఫర్‌ నగర్‌కు చెందిన షేక్‌ హుస్సేన్‌ తన కారులో 10 కాటన్‌ బాక్సుల్లో 360 తెలంగాణ మద్యం బాటిళ్లు తీసుకొస్తుండగా తనిఖీ చేసి సీజ్‌ చేశారు.

సెబ్‌ ఏర్పడినప్పటి నుంచి  నమోదైన కేసుల
మద్యం అక్రమ రవాణా
నమోదైన కేసులు                          6,529
పట్టుబడిన మద్యం(లీటర్లలో)     1,39,686
పట్టుబడిన బీర్లు (లీటర్లలో)         1,098.44
అరెస్ట్‌ అయిన వారి సంఖ్య           9,962
సీజ్‌ చేసిన వాహనాలు                  3,775 

పీడీ యాక్టు అమలు చేస్తాం
మద్యం అక్రమ రవాణా, నాటుసారా తయారీని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. రవాణాదారులతో పాటు సహకరించే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. అవసరమైతే పీడీ చట్టం ప్రయోగించేందుకు వెనుకాడం. విద్యార్థులు, ఉద్యోగులు ఇలాంటి కేసుల్లో పట్టుబడితే భవిష్యత్తు అంధకారం అవుతుంది. అసాంఘిక కార్యకలాపాలపై 7993822444 వాట్సాప్‌ నంబర్‌కు సమాచారం ఇవ్వండి.
– తుహిన్‌ సిన్హా, సెబ్‌ జేడీ

చదవండి: నేటి నుంచి ట్రిపుల్‌ ఐటీల్లో తరగతులు 

మరిన్ని వార్తలు