స్నేహితుడిని చంపి సూట్‌కేస్‌లో కుక్కి..

11 Jan, 2021 08:32 IST|Sakshi

ఆర్థిక లావాదేవీలు, వేధింపుల నేపథ్యంలోనే ఘాతుకం

మద్యం మత్తులో విషయాన్ని నోరు జారిన నిందితులు

ఇద్దరిని అదుపులోకి తీసుకున్న సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌

రాజేంద్రనగర్‌: రాజేంద్రనగర్‌ పరిధిలోని డెయిరీ ఫామ్‌ వద్ద ఆదివారం ఉదయం ఓ సూట్‌కేసులో శవం కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ఇది జరిగిన కొద్దిసేపటికే అది పాతబస్తీకి చెందిన ఆటోడ్రైవర్‌ రియాజ్‌ (24) మృతదేహమని, అతడి స్నేహితులే హతమార్చారని తెలిసింది. నిందితుల్ని సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గౌస్‌నగర్‌కు చెందిన రియాజ్‌కు నేరచరిత్ర ఉంది. రోజూలాగే శుక్రవారం ఉదయం పనికి వెళ్తున్నానని తన భార్య నజ్మాబేగంతో చెప్పి వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె శనివారం సాయంత్రం చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. అతడి స్నేహితులైన ఫెరోజ్, సయ్యద్‌ అలియాస్‌ పర్వేజ్‌ల్లో ఒకరికి నేరచరిత్ర ఉందని, ఈ ముగ్గురూ కలిసే మద్యం తాగేవారని దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌కు ఉప్పందింది. అంతేకాదు.. వీరి మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన స్పర్థలు ఉన్నాయని గుర్తించారు. 

గొడవ తీవ్ర స్థాయికి చేరి
శనివారం రాత్రి పాత బస్తీలోని ఓ వైన్‌షా పు వద్ద మద్యం తాగిన వీరిద్దరూ ఆ మత్తులో గొడవపడ్డారు. ఈ క్రమంలో ముందు రోజు రాత్రి తాము చేసిన హత్యను బయటకు చెప్పా రు. అప్పటికే వీరిపై నిఘా వేసి ఉంచిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తక్షణం ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. చిల్లర దొంగతనాలు చేసే వీరి మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించి స్పర్థలు ఉన్నాయి. దీనికి తోడు ఫెరోజ్‌ ఇంటికి వెళ్లినప్పుడల్లా రియాజ్‌ అతడి సోదరిని వేధించేవాడు. శుక్రవారం రాత్రి ఈ ముగ్గురూ కలసి రియాజ్‌ ఆటోలో మద్యం సేవించారు. అనంతరం రియాజ్, ఫెరోజ్‌ల మధ్య గొడవ ప్రారం భమై తారస్థాయికి చేరింది. దీంతో మిగిలిన ఇద్దరూ కర్రలు, రాళ్లతో రియాజ్‌ను హత్య చేశారు. ఓ సూట్‌కేసులో పర్వేజ్‌ మృతదేహాన్ని పెట్టి పీవీ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్‌ నంబర్‌ 224 వద్ద ఉన్న డెయిరీ ఫామ్‌ సమీపంలో పడేశారు. ఆటోను మైలార్‌దేవ్‌పల్లిలోని ఓ హోటల్‌ వద్ద పార్కు చేసి వెళ్లిపోయారు. 

బయటపడిందిలా..
విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివారం ఉదయం మృతదేహాన్ని రికవరీ చేయడానికి డెయిరీ ఫామ్‌కు వెళ్లారు. అంతకుముందు సూట్‌కేస్‌ నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు రాజేంద్రనగర్‌ పోలీసులకు చెప్పారు. పోలీసులు సూట్‌కేస్‌ తెరిచి చూడగా అందులో మృతదేహం కనిపించింది. దీంతో కలకలం రేగింది. అక్కడకు చేరుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అసలు విషయం తెలిపారు. వైట్నర్‌ సహా రకరకాలైన మత్తు పదార్థాలు వాడిన నిందితులు మత్తు లో ఉండటంతో సోమవారం మరోసారి విచారించాలని నిర్ణయించారు. నాలుగు రోజుల క్రితం పర్వేజ్, ఫెరోజ్‌లు బ్యాటరీ చోరీ చేశారని, ఈ విషయాన్ని రియాజ్‌ చంద్రాయణగుట్ట పోలీసులకు తెలిపాడనే కక్షతోనే రియాజ్‌ను హత్య చేశారని అతడి భార్య నజ్మాబేగం వాపోయింది. 

మరిన్ని వార్తలు