పక్కింటి వారి వేధింపులు.. ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య 

15 Dec, 2021 12:03 IST|Sakshi
సమ్మయ్య (ఫైల్‌)  

సాక్షి, మందమర్రిరూరల్‌(ఆదిలాబాద్‌): పట్టణంలోని పాటచెట్టు ప్రాంతానికి చెందిన కాదాసి సమ్మయ్య (49) అనే ఆటోడ్రైవర్‌ మంగళవారం మందమర్రి రైల్వే స్టేషన్‌ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి పక్కన ఉన్న వారితో జరిగిన గొడవ కారణంగా మనస్తాపం చెంది, తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ సంపత్‌ తెలిపారు.

మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కాగా.. పక్కింటి వారి వేధింపులతోనే సమ్మయ్య ఆత్మహత్య చేసుకున్నాడని, మంగళవారం రాత్రి మృతుని కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి ధర్నాకు దిగారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ ప్రమోద్‌రావు బాధిత కుటుంబంతో మాట్లాడారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టి, న్యాయం చేస్తామని ఆయన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

పురుగుల మందు తాగి యువకుడు.. 
సిర్పూర్‌(యూ)(ఆసిఫాబాద్‌): మండలంలోని మహగాం గ్రామ పంచాయతీ పరిధిలో గల అలిగూడకు చెందిన మంగం వెంకట్రావ్‌ (23) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై సందీప్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అప్పులు పెరిగిపోవడం, వ్యక్తిగత కారణాలతో సోమవారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఉట్నూర్‌ ఆస్పత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ అక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య జారుబాయి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తండ్రి వాగు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెల్లడించారు. 

మరిన్ని వార్తలు