ఒంటరి ప్రయాణికులనే సెలక్ట్‌ చేసుకుని.. ఆపై..

10 Sep, 2021 08:05 IST|Sakshi

సాక్షి,రసూల్‌పురా( హైదరాబాద్‌): ఒంటరిగా ఉన్న ప్రయాణికులను ఆటోలో ఎక్కించుకుని వారి దృష్టి మళ్ళించి నగదు, సెల్‌ఫోన్లు తస్కరిస్తున్న ముఠాను కార్ఖాన బ్లూకోట్స్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం సీఐ రవీందర్‌ తెలిపిన వివరాల మేరకు.. పాతబస్తీ భవానీనగర్‌ జామాల్‌ కాలనీకి చెందిన వాటర్‌ సప్లయర్‌ నవాజ్‌ (24), పహడీషరిఫ్‌ యర్రగుంటకు చెందిన డ్రైవర్‌ ఫయాజ్‌ ఖాన్‌ (22), ఇదే ప్రాంతానికి చెందిన తోపుడు బండి పళ్ళ వ్యాపారి సయ్యద్‌ జహిర్‌ (21) ముఠాగా ఏర్పడ్డారు.

ఇదే నగరంలో వాళ్లు ఆటోలో తిరుగుతూ ఒంటరిగా ఉన్న ప్రయాణికులను ఆటోలో ఎక్కించుకుని వారి వద్ద నున్న నగదు, సెల్‌ఫోన్‌లు దొంగిలించేవారు. కార్ఖాన పీఎస్‌ పరిధిలో బుధవారం చోరీ జరగగా ఫిర్యాదు అందిన గంటలోనే ఆటో గ్యాంగ్‌ను వెంటాడి పట్టుకుని వారిని అరెస్ట్‌ చేశారు. వీరిని పట్టుకున్న బ్లూకోట్స్‌ పోలీసులను అభినందించి వారికి రివార్డు అందజేశారు. కార్యక్రమంలో డీఐ నేతాజి, డీఎస్సై అవినాష్‌బాబు పాల్గొన్నారు. 

చదవండి: డైరీలో.. మమ్మీ నేను బతకడానికి వెళ్తున్నా, నా కోసం..

మరిన్ని వార్తలు