మరో దారుణం: హైదరాబాద్‌లోయువతిపై ఆటో డ్రైవర్ల అఘాయిత్యం

19 Aug, 2021 06:56 IST|Sakshi

సంతోష్‌నగర్‌ పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు 

ఉలిక్కిపడిన నగర పోలీసు విభాగం

ముమ్మరంగా సాగుతున్న దర్యాప్తు 

సీసీ ఫుటేజీ పరిశీలన

సాక్షి హైదరాబాద్‌: నగరంలోని గాంధీ ఆస్పత్రి కేంద్రంగా సామూహిక అత్యాచారం జరిగిందంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసు ఇంకా కొలిక్కిరాకముందే.. ఈ చిక్కుముడి ఇంకా వీడకముందే దక్షిణ మండలంలోని సంతోష్‌నగర్‌ పోలీసులకు మరో సవాల్‌ ఎదురైంది. ఆటోలో ఎక్కిన తనకు మత్తుమందు ఇచ్చి ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఓ బాధితురాలు బుధవారం ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న సంతోష్‌నగర్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మూడు రోజుల వ్యవధిలో నమోదైన రెండో కేసు కావడంతో నగర పోలీసు ఉన్నతాధికారులు ఉలిక్కిపడ్డారు. ఈ కేసును కొలిక్కి తీసుకురావడానికి డీసీపీ గజరావ్‌ భూపాల్‌ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వివరాలు... 

పిసల్‌బండ ప్రాంతానికి చెందిన యువతి సంతోష్‌నగర్‌లో ఉన్న డయాగ్నస్టిక్‌ సెంటర్‌లో పని చేస్తోంది. ప్రతి రోజూ తన విధులు ముగిసిన తర్వాత అక్కడ నుంచి పిసల్‌బండకు ఆటోలో వెళుతూంటుంది. మంగళవారం రాత్రి 9 గంటలకు సంతోష్‌నగర్‌ వద్ద ఆటో ఎక్కింది. ఆ సమయంలో ఆటోలో ఆమెతో పాటు ఓ మహిళ, ఇద్దరు యువకులు ఉన్నారు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత మహిళ దిగిపోగా.. డ్రైవర్‌తో పాటు ఇద్దరు యువకులు ఆటోలోనే ఉన్నారు. ఆ సమయంలో తనపై మత్తు మందు ప్రయోగించినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. 
 
► బుధవారం ఉదయం తనకు మెలకువ వచ్చే సమయానికి షాహిన్‌నగర్‌లోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఉన్నానని, తనపై ఆ ముగ్గురూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారంటూ పోలీసులకు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సంతోష్‌నగర్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వైద్య పరీక్షల నిమిత్తం యువతిని భరోసా కేంద్రానికి తరలించారు. ‘బాధితురాలి ఇచ్చిన ఫిర్యాదులోని అంశాల ఆధారంగా కేసు నమోదు చేశాం. సంతోష్‌నగర్‌ నుంచి షాహిన్‌నగర్‌ వరకు ఉన్న మార్గాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను అధ్యయనం చేస్తున్నాం. వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.  
(చదవండి: ప్రేయసి కోసం ‘ఆమె’లా మారి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన లవర్‌)

మరిన్ని వార్తలు