బాలికతో ఆటోడ్రైవర్‌ అసభ్య ప్రవర్తన

3 May, 2022 03:55 IST|Sakshi

ఐదు నిమిషాల్లోనే నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

పోక్సో చట్టం కింద కేసు నమోదు

కృష్ణలంక (విజయవాడ తూర్పు): ఓ బాలికకు ఆటోడ్రైవర్‌ మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన విజయవాడ నున్న ప్రాంతంలో జరిగింది. కృష్ణలంక సీఐ సత్యానందం కథనం మేరకు.. ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన బాలిక నూజివీడులో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. బెంగళూరులోని ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఆంజనేయులుతో ఏడాది క్రితం ఫేస్‌బుక్‌ ద్వారా ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ అమ్మాయిని కలవడానికని ఆంజనేయులు శనివారం బెజవాడ వచ్చాడు. ఉదయం 11 గంటలకు ఇద్దరు స్నేహితురాళ్లతో కలసి ఆ అమ్మాయి నూజివీడు నుంచి బెజవాడ వచ్చి ఆంజనేయులును కలుసుకుంది. సాయంత్రం 6 గంటల తర్వాత స్వగ్రామం బయలుదేరింది. ఆంజనేయులు ఓ లాడ్జిలో రూమ్‌ తీసుకుని రాత్రికి ఇక్కడే ఉండిపోయాడు. మళ్లీ రాత్రి 10 గంటలకు ఆ బాలిక బస్సులో విజయవాడకు చేరుకుని ఆంజనేయులుకు ఫోన్‌ చేసింది.

అతని ఫోన్‌ స్విచాఫ్‌ రావడంతో ఎక్కడ బస చేశాడో తెలుసుకోవడానికి సింగ్‌నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్‌ షేక్‌ ఖదీర్‌ ఆటోను కిరాయికి మాట్లాడుకుని లాడ్జిల్లో వాకబు మొదలు పెట్టింది. ఆదివారం తెల్లవారుజాము 3 గంటల సమయం వరకూ వాకబు చేసినా ఆంజనేయులు ఆచూకీ లభించలేదు. దీంతో తన ఇంటికి రమ్మని బాలికకు ఆటోడ్రైవర్‌ మాయమాటలు చెప్పాడు. అతడి మాటలు నమ్మి ఆ బాలిక బయలుదేరగా ఆటోను నున్న సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ బాలిక చేయి పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక తప్పించుకుని సమీపంలోని ఓ ఇంటికి చేరుకుంది. వారు 112కు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారమిచ్చారు. 5 నిమిషాలలోనే పోలీసులు బాలికను రక్షించారు. ఆటోడ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఫిర్యాదు మేరకు విచారణ అనంతరం సోమవారం పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు.

మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఉపేక్షించం
– టి.కె.రాణా, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌
112కు కాల్‌ రాగానే పోలీసులు ఘటనా స్థలానికి 5 నిమిషాల్లోనే చేరుకుని ఆటోడ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాలికను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. మహిళలు దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొంటే, ఆపద సమయంలో ఆ యాప్‌ ఉపయోగపడుతుంది. ముఖ పరిచయం లేని వ్యక్తులను నమ్మొద్దు. మహిళలు, బాలికల పట్ల అసభ్యంగా, అమర్యాదగా వ్యవహరిస్తే ఉపేక్షించం. మహిళలు ఒంటరిగా వేళగాని వేళలో బయటకు వచ్చేటప్పుడు, కుటుంబసభ్యుల సహకారం తీసుకోవాలి. 

మరిన్ని వార్తలు