Kadapa Crime: కడపలో విషాదం.. కళాశాలలో చేరిన నాలుగు రోజులకే.. 

18 Jun, 2022 17:59 IST|Sakshi

సాక్షి, కడప అర్బన్‌: కడప నగరంలోని ఊటుకూరులో వున్న రామిరెడ్డి ఫార్మసీ అండ్‌ ఫిజియోథెరపీ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థిని ముద్దం సుజాత(17) తమ హాస్టల్‌ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటనపై విద్యార్థిని బంధువులు, పోలీసులు తెలిపిన కథనం మేరకు వివరాలిలా వున్నాయి. కలసపాడు మండలం నల్లగొండపల్లెకు చెందిన ముద్దం వెంకటేశ్వర్లు, కళావతికి కుమార్తె సుజాత, కుమారుడు ప్రదీప్‌ ఉన్నారు. గతేడాది ఇంటర్‌ పూర్తి చేసిన సుజాతను ఈ నెల 13న కడప నగర శివార్లలోని ఊటుకూరులోని రామిరెడ్డి ఫార్మసీ అండ్‌ ఫిజియోథెరపీ కళాశాలలో బి.ఫార్మసీ మొదటి సంవత్సరంలో చేర్పించారు. 

ఈ క్రమంలో సుజాత 16వ తేదీన ఉదయం 7:30 గంటలకు హాస్టల్‌ నుంచి సహచర విద్యార్థిని సెల్‌ఫోన్‌లో నుంచి తన తల్లి కళావతితో మాట్లాడింది. తరువాత రాత్రి అదే సహచర విద్యార్థిని ఉదయం ఫోన్‌ చేసిన నంబర్‌కే చేసి సుజాత హాస్టల్‌లో వెంటిలేటర్‌ కొక్కేనికి చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని సమాచారం చెప్పింది. దీంతో సుజాత మేనమామ, బాబాయ్‌ ఇద్దరు కలిసి హుటాహుటిన కడపకు వచ్చి కళాశాలకు చేరుకున్నారు. అక్కడ సుజాత మృతదేహాన్ని చూసి తీవ్ర ఆవేదన చెందారు. వెంటనే కుటుంబ సభ్యులను పిలిపించారు. సంఘటన స్థలాన్ని కడప డీఎస్పీ బి.వెంకట శివారెడ్డి, సీఐ ఉలసయ్య, తాలూకా ఎస్‌ఐ ఎస్‌కెఎం హుసేన్‌ తమ సిబ్బందితో కలిసి పరిశీలించారు. మృతదేహాన్ని రిమ్స్‌ మార్చురీకి తరలించారు.  

కళాశాలలో చేరిన నాలుగు రోజులకే.. 
సుజాత కళాశాలలో చేరిన నాలుగు రోజులకే ఈ సంఘటన జరగడంపై చర్చ సాగుతోంది. సుజాత తండ్రి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమ కుమార్తె ఇంటి దగ్గర కూడా ఎవరితోనూ మాట్లాడేది కాదన్నారు. తమ ఆర్థిక పరిస్థితి సరిగాలేక ఆలస్యంగా కళాశాలలో చేర్పించామన్నారు. విద్యను అభ్యసించేందుకు ఎంతో ఆసక్తి చూపించిందని,  శుక్రవారం కడపకు వచ్చి మాట్లాడి వెళదామనుకునేలోపే ఇలాంటి సంఘటన జరుగుతుందనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  

జిల్లా అదనపు ఎస్పీ విచారణ   
సుజాత మృతి సంఘటనపై జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ నీలం పూజిత విచారణ చేశారు. కడప రిమ్స్‌ మార్చురీలో వున్న సుజాత మృతదేహాన్ని ఆమె పరిశీలించారు. సుజాత తండ్రి వెంకటేశ్వర్లు, బంధువులను విచారణ చేశారు. సంఘటనపై ఎలాంటి అనుమానాలున్నా ఫిర్యాదులో పేర్కొనాలని, కేసు నమోదు చేయడంతోపాటు సమగ్రంగా దర్యాప్తు చేస్తామన్నారు. అదనపు ఎస్పీ వెంట కడప డీఎస్పీ బి.వెంకటశివారెడ్డి, కడప తాలూకా సీఐ ఉలసయ్య, ఎస్‌ఐ ఎస్‌కెఎం హుసేన్, సిబ్బంది ఉన్నారు.  

సమగ్రంగా విచారణ జరపాలి  
సుజాత మృతి సంఘటనపై సమగ్రంగా విచారణ జరపాలని మహిళా కమిషన్‌ సభ్యురాలు గజ్జెల వెంకట లక్ష్మి కోరారు. సుజాత మృతిపై స్పందించిన ఆమె వెంటనే కడప తాలూకా సీఐతో ఫోన్‌లో మాట్లాడారు.  

విద్యార్థి, ప్రజా సంఘాల ధర్నా 
కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌/ చింతకొమ్మదిన్నె : విద్యార్ధి సుజాత మృతికి కారకులైన వారిని శిక్షించాలని వివిధ సంఘాల నేతలు కోరారు. రిమ్స్‌లోని మార్చురీ ఉన్న సూజాత మృతదేహాన్ని వారు పరిశీలించారు. అనంతరం కళాశాల ఎదుట ధర్నా చేపట్టారు. వారిని పోలీసులు అరెస్ట్‌ చేసి చింతకొమ్మదిన్నె పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుమల్లేష్, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శులు సగిలి రాజేంద్ర ప్రసాద్, వలరాజు, వివిధ, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు అంకన్న, ఆర్‌ఎన్‌ రాజా, వేణు, శంకర్, జయవర్దన్, ప్రశాంత్, గోపి తదితరులు పాల్గొన్నారు. 
కళాశాల వద్ద పటిష్ట బందోబస్తు కళాశాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

మరిన్ని వార్తలు