Warangal: లారీని ఓవర్‌టేక్‌ చేయబోతూ వాటర్‌ ట్యాంకర్‌ను ఢీకొన్న బైక్‌.. ఎగరిపడ్డ హెల్మెట్‌

6 Dec, 2022 14:28 IST|Sakshi
వినీత్‌రెడ్డి(ఫైల్‌)

వారిది నిరుపేద కుటుంబం. పొలం కౌలుకు చేస్తూ.. నాలుగు గేదెలను సాకుతూ జీవనం సాగిస్తున్నారు. కొడుకును బాగా చదివించి విదేశాలకు పంపాలనేది వారి కల. అందుకోసం అప్పు తెచ్చి మరీ వరంగల్‌లో బీటెక్‌ చదివిస్తున్నారు. కానీ వారి కలను రోడ్డు ప్రమాదం మింగేసింది. మంగళవారం ఇంటికి వస్తానని ఫోన్‌ చేసిన కుమారుడు.. విగతజీవిగా వస్తున్నాడని తెలిసి ఆ తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది. 

సాక్షి, మామునూరు/జనగామ: ఖమ్మం జాతీయ రహదారిపై వాహనాన్ని ఓవర్‌టెక్‌ చేయబోతూ ఎదురుగా వస్తున్న వాటర్‌ ట్యాంకర్‌ను ద్విచక్ర వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బీటెక్‌ విద్యార్థి వినీత్‌రెడ్డి(22) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈఘటన సోమవారం రాత్రి ఖిలా వరంగల్‌ మండలం మామునూరు శివారు పంజాబ్‌ డాబా ఎదురుగా జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రఘునాథపల్లి మండలం నిడిగొండ శివారు తూర్పుగడ్డకు చెందిన గాదె సునీల్‌రెడ్డి, అనురాధ దంపతుల కుమారుడు వినీత్‌రెడ్డి. సొంతభూమి లేకపోవడంతో  కౌలుకు తీసుకుంటూ వ్యవసాయం చేస్తున్నాడు. నాలుగు గేదెలను సాకుతూ పాలు పోస్తూ ఉపాధి పొందుతున్నారు.

వినీత్‌రెడ్డిని బాగా చదివించి విదేశాలకు పంపాలనేది తల్లిదండ్రుల కోరిక. వినీత్‌ రంగశాయిపేటలో అద్దె గదిలో ఉంటూ బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ సీఎస్‌ఈ చదువుతున్నాడు. 15 రోజుల క్రితం ఇంటికి వచ్చి వెళ్లాడు. రోజువారిగానే సోమవారం ఉదయం కళాశాలకు వెళ్లి తిరిగి రాత్రి 8.40 గంటల సమయంలో ద్విచక్రవాహనంపై రూమ్‌కు బయల్దేరాడు.

మామునూరు పోలీస్‌స్టేషన్‌ దాటిన తర్వాత పంజాబ్‌ నేషనల్‌ డాబా సమీపంలోకి రాగానే లారీని ఓవర్‌టేక్‌ చేయబోతూ ఎదురుగా వచ్చే వాటర్‌ ట్యాంకర్‌ను బలంగా ఢీకొట్టాడు. దీంతో యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న మామునూరు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందజేసి మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. అనంతరం జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. 

ఎగిరిపడ్డ హెల్మెట్‌
వినీత్‌రెడ్డి హెల్మెట్‌ పెట్టుకుని బైక్‌పై వస్తున్నాడు. బలంగా ఢీకొనడంతో తలకు ఉన్న హెల్మెట్‌ ఎగిరి దూరంలో పడింది. దీంతో అతడి తల రోడ్డుకు బలంగా తాకడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. హెల్మెట్‌ తలకు ఉంటే బతికేవాడని అనుకుంటున్నారు.

ఇంటికి వస్తానన్నాడు..
‘మంగళవారం ఇంటికి వస్తానని కాలేజీకి వెళ్లేముందు ఫోన్‌ చేశాడు. కానీ విగతజీవిగా వస్తాడనుకోలేదు’అంటూ తల్లిదండ్రులు సునీల్‌రెడ్డి, అనురాధలు గుండెలవిసేలా రోదిస్తున్న తీరు స్థానికులను కంటతడిపెట్టించింది.

మరిన్ని వార్తలు