ప్లాస్టిక్‌ కవర్‌లో పసివాడి ప్రాణం

27 Feb, 2023 03:39 IST|Sakshi
జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న శిశువు

రెండురోజుల మగ శిశువును క్యారీ బ్యాగులో పెట్టి పాడుబడిన ఇంట్లో వదిలివెళ్లిన వైనం

స్థానికుల సమాచారంతో జీజీహెచ్‌కి తరలించిన పోలీసులు

గుంటూరులో అమానుషం

గుంటూరు ఈస్ట్‌: నవమాసాలు మోసిన తల్లి... ‘కని’కరం లేకుండా 48గంటల్లోనే తన బిడ్డను వదిలేసింది. పేగు తెంచి పంచిన పసి ప్రాణా­న్ని తన పొత్తిళ్లలో అదుముకుని అల్లారు­ముద్దుగా చూసుకోకుండా... చెత్తను విసిరేసి­నంత సులభంగా ప్లాస్టిక్‌ కవర్‌లో పెట్టి పాడు­బడిన ఇంట్లో పడేసింది. తల్లి స్పర్శ కోసం గుక్కపెట్టిన ఆ శిశువు ఏడుపు విని పక్క ఇంట్లో ఉంటున్న మరో మాతృమూర్తి వచ్చి ఆ బిడ్డను కాపాడారు.

ఈ హృదయవిదారక ఘ­టన గుంటూరులో ఆదివారం జరిగింది. గుంటూరు కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నగరంలోని గుంటూరువారితోట 5వ లైనులో ఓ పాడుబడిన భవనం పై నుంచి ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఓ శిశువు ఏడుపు వినిపించడంతో పక్క ఇంట్లో ఉన్న మహిళ చూసేందుకు వెళ్లారు. అక్కడ పాలిథిన్‌ క్యారీ బ్యాగులో మగ శిశువు కనిపించాడు.

ఆమె వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొత్తపేట పోలీసులు ఘటనస్థలానికి వెళ్లి ఆ శిశువుని ప్రభుత్వాస్పత్రికి తరలించగా, పిల్లల విభాగంలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆ శిశువు పుట్టి రెండు రోజులు అయి ఉంటుందని, ప్రస్తుతం చిన్నారి ఆరో­గ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.

ఆ శిశువు ఉన్న పాడుబడిన భవనం చుట్టూ హాస్పిటల్స్‌ ఉండటంతో సమీపంలోనే డెలివరీ అయి ఇక్కడ వదిలి వెళ్లి ఉంటారని భావిస్తు­న్నారు. కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటే­జీని పరిశీలిస్తూ శిశువును ఎవరు వదిలి వెళ్లారనే విషయాన్ని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.  

మరిన్ని వార్తలు