16 రోజుల పసికందును వాటర్‌ ట్యాంకులోపడేసి..

10 Jul, 2021 07:45 IST|Sakshi
చిన్నారి మృతదేహం

నెల్లూరు (క్రైమ్‌): నిండా పదహారు రోజులు కూడా నిండని పసికందును పొట్టనబెట్టుకున్నారు. వాటర్‌ ట్యాంకులోపడేసి చిన్నారి ఉసురు తీశారు. నెల్లూరు రంగనాయకులపేట గొల్లవీధిలో శుక్రవారం జరిగిన ఈ అమానుష ఘటన స్థానికులను కలచివేసింది. పోలీసుల కథనం.. విద్యావతికి 2018లో కొడవలూరు పెయ్యళపాలేనికి చెందిన వెంకటేశ్వర్లుతో వివాహమైంది. వారికి రెండేళ్ల పాప అద్వికత ఉంది. గత నెల 24న విద్యావతి మరో పాపకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి విద్యావతి ఇద్దరు పిల్లలతో కలిసి గొల్లవీధిలోని తల్లి వద్దే ఉంటోంది.

శుక్రవారం చిన్నారికి విద్యావతి స్నానం చేయించి మొదటి అంతస్తులోని ఊయల్లో పడుకోబెట్టి నిద్రపోయింది. కొద్దిసేపటికి మెలకువ వచ్చి ఊయల్లో చూడగా పాప లేదు. ఇల్లంతా వెదికినా కనిపించలేదు. కుటుంబ సభ్యులు, స్థానికులు చుట్టుపక్కల అంతా గాలించినా ఫలితం లేకపోయింది. విద్యావతి నివాసముంటున్న పక్క ఇంట్లోనే ఆమె చిన్నమ్మ జ్యోతి ఉంటోంది. ఆమె ఇంటి మిద్దెపై ఉన్న వాటర్‌ ట్యాంకులో పాప మృతిచెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు.

ఆ చిన్నారి మృతదేహాన్ని చూసిన ఆ తల్లి, అమ్మమ్మలను ఓదార్చడం ఎవరితరం కాలేదు. సంతపేట ఇన్‌స్పెక్టర్‌ అన్వర్‌బాషా ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. జ్యోతే ఈ దురాగతానికి ఒడిగట్టి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ విద్యావతి తల్లి శారద పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు