అమానుషం: పసిపాపను వదిలించుకునేందుకు..

24 Nov, 2020 09:02 IST|Sakshi

మృత్యువును జయించిన నవజాత శిశువు

లక్నో: ఆడపిల్ల భారం అనుకున్నారేమో ఆ తల్లిదండ్రులు. పురిట్లోనే తనను వదిలించుకునేందుకు పథకం రచించారు. పసిబిడ్డ అనే కనికరం లేకుండా సంచీలో తనను కుక్కి రోడ్డు పక్కన పడేశారు. కన్నవాళ్లు అంత కర్కశకంగా ప్రవర్తించినా బాటసారులు మాత్రం మానవత్వం చాటుకున్నారు. దీంతో ఆ చిన్నారి మృత్యువును జయించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. మీరట్‌లోని శతాబ్దినగర్‌లో రోడ్డు పక్కన నవజాత శిశువు ఏడుపు విన్న స్థానికులు పాప కోసం వెదికగా.. సంచీలో కుక్కి ఉన్నట్లు గుర్తించారు. నెమ్మదిగా తనను బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. 

ఇక ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు చిన్నారిని సమీప ప్యారేలాల్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను స్థానికులు సెల్‌ఫోన్‌లో బంధించగా ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ‘ఇలాంటి ఘాతుకానికి పాల్పడేందుకు అసలు ఆ తల్లిదండ్రులకు మనసెలా వచ్చిందో. పసిపాప అనే కనికరం లేకుండా అమానుషంగా ప్రవర్తించారు. వాళ్లసలు మనుషులేనా’ అంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్న తీరు మానవత్వమున్న ప్రతి ఒక్కరి మనస్సును కదిలిస్తోంది.(చదవండి: గర్భవతితో సహజీవనం.. దారుణ హత్య)

ఈ మీరట్‌ ఘటన గురించి పోలీసు ఉన్నతాధికారి అఖిలేశ్‌ నారాయణ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘‘రోడ్డు పక్కన సంచీలో పసిపాపను గుర్తించినట్లు శతాబ్దినగర్‌ నుంచి కాల్‌ వచ్చింది. దీంతో అక్కడికి చేరుకున్న మా బృందం తనను జిల్లా ఆస్పత్రిలో చేర్పించింది. నెలలు నిండకముందే పుట్టినప్పటికీ ప్రస్తుతం తను ఆరోగ్యంగానే ఉందని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం తను కోలుకుంటోంది’’ అని పేర్కొన్నారు. కాగా లింగ సమానత్వంపై అవగాహన కల్పించేందుక ప్రభుత్వాలు ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా సమాజంలో మార్పు రావడం లేదు. గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే, అబార్షన్లు చేయించేవాళ్లు కొందరైతే, అన్ని అడ్డంకులు దాటుకుని ఈ భూమి మీద పడిన పసిపాపలను పురిట్లోనే చంపేసేవారు ఎంతో మంది ఉన్నారు.

మరిన్ని వార్తలు